usa visa: హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల ఉపాధిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: అమెరికా

  • హెచ్1బీ వీసాదారులు ఉద్యోగం చేసుకునేందుకు గతంలో ఒబామా సర్కారు అవకాశం
  • దాన్ని ఎత్తివేయాలని భావిస్తున్న ట్రంప్ సర్కారు 
  • ఇంకా నిబంధనలు రూపొందించలేదు
  • అప్పటి వరకూ తుది నిర్ణయం తీసుకోనట్టేనన్న సీనియర్ అధికారి

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హెచ్ 1బి వీసాదారుల జీవిత భాగస్వాములు (భార్య/భర్త) సైతం అక్కడే ఉపాధి చూసుకునేందుకు ఉన్న అవకాశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా పౌర, వలస సేవల విభాగం అధికార ప్రతినిధి ఫిలిప్ స్మిత్ తెలిపారు. అమెరికాలో ఉద్యోగంపై పనిచేస్తున్న వారి భార్య లేదా భర్త సైతం అక్కడే ఉద్యోగం వెతుక్కుని పనిచేసుకునేందుకు అవకాశం ఉంది. గతంలో ఒబామా సర్కారు ఇందుకు వీలు కల్పించింది. అమెరికన్లకే ఉద్యోగాలు అన్న విధానంలో భాగంగా దీన్ని ఎత్తివేయాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు.

ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జూన్ లో వెలువడతాయని భావిస్తుండడంతో దీన్ని ఉపసంహరించుకోవాలని 130 మంది చట్టసభ సభ్యులు అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ (జాతీయ భద్రతా మంత్రి)కి లేఖ రాసిన విషయం విదితమే. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు గాను హెచ్4 వీసాలు జారీ చేస్తున్నారు. భారత్ కు చెందిన సుమారు 70,000 మంది హెచ్4 వీసాదారులు అమెరికాలో పనిచేస్తున్నారు. ఒకవేళ ఈ అవకాశం ఎత్తివేస్తే వీరంతా ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది. నిబంధనల రూపకల్పన ప్రక్రియ పూర్తి కానంతవరకూ హెచ్4 వీసాలపై తుది నిర్ణయం తీసుకోనట్టేనని ఫిలిప్ స్మిత్ స్పష్టం చేశారు.

More Telugu News