Gujarath: 22 ఏళ్ల క్రితం దేవెగౌడ చేసిన అవమానానికి నేడు ప్రతీకారం తీర్చుకున్న గవర్నర్ వాజూభాయ్!

  • 1996లో గుజరాత్ ప్రభుత్వాన్ని పడగొట్టిన దేవెగౌడ
  • అప్పట్లో మంత్రి పదవిని పోగొట్టుకున్న వాజూభాయ్
  • ఇంతకాలానికి తీరిన పగ!

దాదాపు 22 సంవత్సరాల క్రితం దేవెగౌడ ప్రధాన మంత్రిగా ఉన్న వేళ, తనకు, తన పార్టీకి జరిగిన అన్యాయానికి ప్రస్తుత కర్ణాటక గవర్నర్ గా ఉన్న వాజూభాయ్ ప్రతీకారం తీర్చుకున్నారు. నాడు తనకు మంత్రి పదవిని దూరం చేసే నిర్ణయం తీసుకున్న దేవెగౌడ కుమారుడికి, ఇప్పుడు సీఎం పీఠం దక్కకుండా చేశారు. 22 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఈ సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుంటే... 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్న వేళ, గుజరాత్ లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయింది.

అప్పటికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వాజూభాయ్ కి, మెహతా ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రి పదవి దక్కింది. ఇక ఆ సమయంలో బీజేపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను విడగొట్టిన శంకర్ సింగ్ వాఘేలా, కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో గుజరాత్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు సిఫార్సు చేసిన దేవెగౌడ, వాజూభాయ్ పదవిని మూన్నాళ్ల ముచ్చటగా మార్చారు.

అప్పటి గవర్నర్ సైతం మెజారిటీ సీట్లున్న బీజేపీకి బదులు ఆర్జేడీ (వాఘేలా స్థాపించిన పార్టీ)ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ ప్రభుత్వం 1998 వరకూ కొనసాగగా, ఆ తరువాతి కాలంలో వాజూభాయ్ ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రి పదవి దక్కలేదు. నాలుగేళ్ల క్రితం బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తరువాత వాజూభాయ్ ని కర్ణాటక గవర్నర్ గా నియమించగా, నాడు దేవెగౌడ చేసిన పనికి, నేడు ప్రతీకారం తీర్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News