Uttar Pradesh: మతకలహాల్లో స్వయంగా పాల్గొని విధ్వంసం సృష్టించిన 10 మంది పోలీసులు... ఔరంగాబాద్ లో సంచలనం సృష్టిస్తున్న వీడియో!

  • 9 నిమిషాల నిడివి ఉన్న వీడియో క్లిప్
  • నిరసనకారులతో కలసిపోయిన 10 మంది పోలీసులు
  • పోలీసు వ్యవస్థపై మాయని మచ్చ
  • కఠిన చర్యలుంటాయన్న ఉన్నతాధికారులు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో వైరల్ అవుతున్న 9 నిమిషాల నిడివివున్న ఓ వీడియో క్లిప్, ఇప్పుడు పోలీసు శాఖలో తీవ్ర అలజడి రేపుతోంది. ఈ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా, దాదాపు 10 మంది పోలీసులు నిరసనకారులతో కలసి వాహనాలను తగులబెడుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆందోళన చేస్తున్న వారు పెట్రోలు క్యానులతో వెళుతుంటే, పోలీసులు వారికి సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.

శనివారం తెల్లవారుజామున ఓ భవంతి కిటికీ నుంచి ఈ వీడియోను తీసినట్టు ఉండగా, పోలీసుల వైఖరిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు పోలీసులకు కూడా లేదని, ఈ వీడియోలో కనిపిస్తూ, విధ్వంసాలకు దగ్గరుండి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలుంటాయని అదనపు డీజీపీ బిపిన్ బిహారీ పేర్కొన్నారు.

 ఈ ఘటన పోలీసు వ్యవస్థకే మాయనిమచ్చని ఔరంగాబాద్ పోలీస్ చీఫ్ మిలింద్ భరాంబే వ్యాఖ్యానించారు. ఇది తీవ్రమైన తప్పిదమని, విచారణ ప్రారంభించామని అన్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కకుండా చూడాలని అన్ని సామాజిక మాధ్యమ సంస్థలకూ అధికారులు ఆదేశాలు పంపారు. నగరంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించారు.

More Telugu News