Congress: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ రాకుంటే.. తమ మద్దతు ఎవరికో చెప్పేసిన జేడీఎస్!

  • బీజేపీతో వెళ్లేది లేదన్న జేడీఎస్
  • కాంగ్రెస్‌తో కలిసి వెళ్లడం తమ బాధ్యతన్న అధికార ప్రతినిధి
  • జేడీఎస్ ప్రకటనపై స్పందించని కాంగ్రెస్
  • పూర్తి మెజారిటీ ధీమాలో సిద్ధరామయ్య

కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. ఒక్కో సర్వే ఒక్కోలా చెబుతుండడంతో అందరిలోనూ అయోమయం ఏర్పడింది. అయితే ఒక్క విషయంలో మాత్రం స్పష్టత ఉంది. అదే హంగ్! కర్ణాటకలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని సర్వేలను బట్టి తెలుస్తోంది. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ సెక్యులర్ (జీడీఎస్) కీలకంగా మారింది. ఆ పార్టీ మద్దతు ఇచ్చే వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో జేడీఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను బట్టి జేడీఎస్ మద్దతు బీజేపీకేనని అందరూ భావించారు. అయితే, ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, కాంగ్రెస్ కనుక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలవకుంటే తమ మద్దతు ఆ పార్టీకేనని, అది తమ బాధ్యత అని జేడీఎస్ అధికార ప్రతినిధి డానిల్ అలీ తెలిపారు.

కర్ణాటక పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన తొమ్మిది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా క్లారిటీ ఇవ్వలేకపోయాయి. చాలా వరకు పోల్స్ బీజేపీ సుమారు 97 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 112 సీట్లు అవసరం. బీజేపీ తర్వాతి స్థానంలో 90 సీట్లతో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. జేడీఎస్‌కు 31 సీట్లు రావచ్చని అంచనా వేశాయి. అంటే.. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలకపాత్ర పోషించనుంది. ఆ పార్టీ మద్దతు ఇచ్చిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.

ఇక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, జేడీఎస్‌ను బీజేపీ-బి టీమ్‌గా అభివర్ణించారు. రాహుల్ ఆరోపణలను దేవెగౌడ కొట్టివేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత జేడీఎస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి అయిన డానిష్ అలీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీతో మేం వెళ్లే ప్రసక్తే లేదు. కాంగ్రెస్‌కు ఒకవేళ మెజారిటీ రాకుంటే, ఆ పార్టీకి వంద లోపు సీట్లు వస్తే.. అప్పుడు మేం కాంగ్రెస్‌తోనే వెళ్తాం. అది మా బాధ్యత కూడా’’ అని పేర్కొన్నారు.

జేడీఎస్ ప్రకటనపై కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. తమకు పూర్తి మెజారిటీ వస్తుందని, ఎవరి మద్దతు తమకు అవసరం లేదన్న ధీమాతో సిద్ధరామయ్య ఉండడమే అందుకు కారణంగా కనిపిస్తోంది.

More Telugu News