Facebook: క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చేందుకు ఫేస్ బుక్ ఆసక్తి... ప్రత్యేక టీమ్ ఏర్పాటు

  • ఫేస్ బుక్ కు 200 కోట్ల మంది యూజర్లు 
  • బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి 
  • ప్రకటించిన కంపెనీ

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ క్రిప్టో కరెన్సీపై దృష్టి పెట్టింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఈ టెక్నాలజీ ఆధారిత అవకాశాలను అన్వేషించే బాధ్యతల్ని అప్పగించింది. ఫేస్ బుక్ కు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. క్రిప్టో కరెన్సీని తీసుకొస్తే ప్రపంచవ్యాప్తంగా తన యూజర్లకు బిట్ కాయిన్ తరహాలో వర్చువల్ కరెన్సీ ద్వారా చెల్లింపులకు అవకాశం ఉంటుందని భావిస్తోంది.

’’ఫేస్ బుక్ లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఏ విధంగా మెరుగ్గా వినియోగించుకోవచ్చనే దాన్ని పరిశీలించేందుకు ఓ చిన్న జట్టును ఏర్పాటు చేశా’’ అని ఫేస్ బుక్ మెస్సెంజర్ ఎగ్జిక్యూటివ్ ఇంచార్జ్ డేవిడ్ మార్కస్ తెలిపారు. ఇతర కంపెనీల మాదిరిగానే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ శక్తిని అందిపుచ్చుకునేందుకు ఫేస్ బుక్ ప్రయత్నిస్తుందని కంపెనీ సైతం ప్రకటన జారీ చేసింది. భిన్నమైన అప్లికేషన్లను బ్లాక్ చెయిన్ ఆధారంగా తీసుకురావడంపై ఈ జట్టు దృష్టి పెడుతుందని తెలిపింది. ఇంతకంటే చెప్పేందుకు ప్రస్తుతానికి ఏమీ లేదని పేర్కొంది. బిట్ కాయిన్ సైతం బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తుందని తెలిసిందే.

More Telugu News