Dog: పార్థీ గ్యాంగ్ ప్రచారం.. కుక్కల వ్యాపారం కోసమా?

  • కుక్కల వ్యాపారి అతి తెలివి
  • వ్యాపారాన్ని పెంచుకునేందుకు పార్థీ గ్యాంగ్ పేరు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శునకాల వ్యాపారి వినోద్ కుమార్ ‌రెడ్డి తనలో తెలివితేటలకు ఏమాత్రం కొదవలేదని నిరూపించాడు. కుక్కలను అమ్ముకునేందుకు ఏకంగా కరుడుగట్టిన పార్థీ గ్యాంగ్ పేరును వాడుకుని జనాల్లో భయభ్రాంతులు సృష్టించాడు. పార్థీ గ్యాంగ్ రాయలసీమలో అడుగుపెట్టిందని, జాగ్రత్తగా ఉండాలని, డబ్బు కోసం ముఠా సభ్యులు ఎంతకైనా తెగిస్తారని, మానప్రాణాలను హరించేందుకు కూడా వెనకాడరంటూ ఓ మెసేజ్ సృష్టించి ప్రజల్లోకి వదిలాడు. ఇంట్లో శునకాలను పెంచుకోవడం ద్వారా నిశ్చింతగా ఉండొచ్చంటూ చివర్లో ట్యాగ్‌లైన్ కూడా తగిలించాడు.

వ్యాపారం సంగతేమో కానీ ప్రజలు మాత్రం ఆ మెసేజ్ చూసి వణికిపోయారు. గత మూడు నాలుగు రోజులుగా నిద్రాహారాలు మాని మరీ మెలకువగా ఉంటున్నారు. ఎటువైపు నుంచి పార్థీ గ్యాంగ్ దాడి చేస్తుందో తెలియక కర్రలతో కాపలా కాస్తున్నారు. వినోద్ కుమార్ సృష్టించిన మెసేజ్ పోలీసుల వరకు చేరడంతో రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా గాలింపు చేపట్టి పార్థీ గ్యాంగ్ ముఠా దిగిందన్నది అవాస్తవమని తేల్చేశారు. దీంతో మెసేజ్‌ను సృష్టించిన వినోద్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

తన కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవడానికే ఈ మెసేజ్ సృష్టించానని, మరే దురుద్దేశం లేదని విచారణలో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. పార్థీ గ్యాంగ్‌పై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఎవరూ నమ్మవద్దని కడప పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

More Telugu News