Cop Connect: ఏ సమాచారమైనా సెకన్లలోనే లక్షమంది పోలీసులకు... తెలంగాణ పోలీసుల ఫోన్ లో కొత్త యాప్!

  • లక్ష మంది సభ్యులతో గ్రూప్
  • ఏ నేరమైనా క్షణాల్లో సమాచారం చేరవేత
  • మరే రాష్ట్రంలో లేని 'కాప్ కనెక్ట్'

తెలంగాణ పోలీసుల చేతికి సరికొత్త టెక్ ఆయుధం వచ్చి చేరనుంది. దాదాపు లక్ష మందితో ఓ గ్రూప్ ఏర్పాటు చేసి, ఏ సమాచారాన్ని అయినా క్షణాల్లోనే పంపేలా సరికొత్త యాప్ 'కాప్ కనెక్ట్' సిద్ధమైంది. దీంతో రాష్ట్రంలోని ఏ నేర సమాచారమైనా... అంటే దొంగతనం, అదృశ్యం, కిడ్నాప్ వంటి ఏ నేరానికి సంబంధించిన సమాచారమైనా ఈ యాప్ ద్వారా 60 వేల మంది పోలీసుల అరచేతుల్లోకి క్షణాల్లో వెళ్లిపోతుంది.

'కాప్ కనెక్ట్' పోలీసు వ్యవస్థ పనితీరులో మంచి మార్పు వస్తుందని స్వయంగా అధికారులే అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు సమాచార బట్వాడాకు వాట్స్ యాప్ వంటివి వాడుతున్నారు. అయితే, వాట్స్ యాప్ లోని ఒక గ్రూప్ లో గరిష్ఠంగా 256 మందిని సభ్యులుగా చేర్చేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీంతో ఎక్కడికక్కడ చిన్న చిన్న గ్రూపులతో పోలీసులు సమాచారాన్ని పంపుకుంటున్నారు.

ఇక ఈ సమస్యను అధిగమించేందుకు సరికొత్త మొబైల్ యాప్ కావాలని డీసీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో కదిలిన పోలీసు టెక్నికల్ బృందం ప్రత్యేక డేటా బేస్ ను, యాప్ ను తయారు చేశారు. పోలీసులు మాత్రమే దీన్ని వాడుకునే వీలుంటుంది. దీని సర్వర్ హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ఉంటుంది. ఇందులో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకూ సభ్యులుగా ఉంటారు.

60 వేల మంది పోలీసులతో ఓ గ్రూప్, సీఐలు, ఎస్ఐలతో ఓ గ్రూప్, పెట్రోలింగ్ కు తిరిగే బృందాలతో మరో గ్రూప్, క్రైమ్ కానిస్టేబుళ్లకు ఇంకో గ్రూప్, కోర్టు కానిస్టేబుళ్లకు మరో గ్రూప్... ఇలా ఎవరికి సంబంధించిన సమాచారం వారికి క్షణాల్లో అందేలా ఈ యాప్ పని చేస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఆరు నెలల శ్రమ అనంతరం యాప్ సిద్ధమైందని, ఇటువంటిది ఇండియాలో మరే రాష్ట్రంలోనూ లేదని తెలిపారు. రెండు వారాల్లో దీన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

More Telugu News