మోదీ ఆదేశాలు ఇచ్చారు.. కేసీఆర్ సమీక్ష చేశారు!: 'ఓటుకు నోటు' కేసుపై రేవంత్ రెడ్డి
- నిన్న కేసీఆర్ భేటీపై రేవంత్ రెడ్డి ఫైర్
- మోదీ, కేసీఆర్ కలిసి నాటకం ఆడుతున్నారు
- అందులో భాగమే నిన్నటి వ్యవహారం
- ఓటుకు నోటు కేసు వివరాలు నేను చెప్పకూడదు
ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసుకి సంబంధించి వివరాలు చెప్పాలని తాను అనుకోవట్లేదని, ఈ విషయంపై మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ తీరుని మాత్రం ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం నిన్న పలువురు అధికారులతో కేసీఆర్ ఏడు గంటలు ఓటుకు నోటు కేసుపై చర్చించారని అన్నారు.
ఇటీవల భారత రాజకీయ అంశాలను గమనిస్తే ప్రధానంగా ఏపీకి ప్రధాని మోదీ అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. అదే సమయంలో తెలంగాణలో టీఆర్‌ఎస్ వైఫల్యాలపై తాము పోరాడుతున్నామని, తాను కాంగ్రెస్ సభల్లో పాల్గొంటూ కేసీఆర్ సర్కారు ఎన్ని కోట్ల రూపాయల అనినీతికి పాల్పడిందో వివరిస్తున్నానని తెలిపారు.
రాష్ట్ర ప్రజల్లో ఆలోచన కలుగజేస్తూ చైతన్యం తీసుకొస్తున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితం కొనసాగించడానికి ఎటువంటి చర్యలకు పాల్పడుతుందో వివరించి చెబుతున్నానని అన్నారు. దీంతో మోదీ, కేసీఆర్ ఈ విషయాలను జీర్ణించుకోలేకపోతున్నారని, మోదీ ఆదేశాల మేరకు కేసీఆర్ నిన్న సమీక్ష జరిపారని అన్నారు.