ఏం చెప్పమంటారు... ఇదీ మా దీనగాథ!: విరాట్ కోహ్లీ

08-05-2018 Tue 09:50
  • ప్లే ఆఫ్ కు దూరమైన ఆర్సీబీ
  • చేజేతులా ఓడిపోయామన్న కోహ్లీ
  • నాలుగు వికెట్లు ఉంచుకుని 5 పరుగులు చేయలేకపోయాం
  • కుదురుగా ఆడుంటే గెలిచుండేవాళ్లం: కోహ్లీ

గత రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ పోరులో ఓడిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, ప్లే ఆఫ్ కు దూరం కాగా, ఇదే మ్యాచ్ లో మరోసారి స్వల్ప స్కోరును కాపాడుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 16 పాయింట్లను సాధించి ప్లే ఆఫ్ కు దాదాపు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్ పై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, చేతిలో నాలుగు వికెట్లు ఉంచుకుని కూడా 5 పరుగులు సాధించలేకపోయామని అన్నాడు.

టోర్నీలో తమ జట్టుది దీనగాథని వ్యాఖ్యానించిన కోహ్లీ, చెత్త షాట్లు ఆడి వికెట్లను పారేసుకున్నామని, పిచ్ చాలా స్లోగా ఉందని అన్నాడు. కాస్తంత కుదురుగా ఆడితే, పరుగులు సులువుగా సాధించవచ్చని మన్ దీప్, గ్రాండ్ హోమ్ ల జోడీ నిరూపించిందని అన్నాడు. బౌలర్లు కనీసం 10 నుంచి 15 పరుగులు తక్కువగా ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచిందని చెప్పడం కన్నా, తాము చేజేతులా ఓడిపోయామని అనడం సబబని వ్యాఖ్యానించాడు.