Gali Janardhan Reddy: కర్ణాటకలో గెలుపే లక్ష్యం.. ‘గాలి’ మైనింగ్ కేసుల ఎత్తివేతకు రంగం సిద్ధం!

  • ఇనుప ఖనిజం అక్రమ రవాణాపై సాక్ష్యాలు లేవన్న సీబీఐ
  • లోకాయుక్త నివేదిక బుట్టదాఖలు
  • పక్కా ప్లానింగ్‌తోనే కేసుల ఎత్తివేతకు రంగం సిద్ధం
  • కర్ణాటక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డిపై ఉన్న కేసుల మూసివేతకు రంగం సిద్ధమవుతోందా? అంటే, తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇందుకోసం రెండేళ్ల నుంచే ప్రయత్నాలు ప్రారంభమైనట్టు సమాచారం. కర్ణాటకలో ఈనెలలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ సర్కారు రెండేళ్ల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసింది.

జనార్దన్ రెడ్డిని ఉపయోగించుకోవడం ద్వారా కర్ణాటకలో విజయ కేతనం ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపిన విషయం బయటపడింది. అందులో భాగంగా జనార్దన్ రెడ్డిపై ఉన్న మైనింగ్ కేసులను సాంకేతిక కారణాలతో మూసివేయాలని నిర్ణయించింది. ఫలితంగా రూ.35 వేల కోట్ల విలువైన మైనింగ్ కుంభకోణాన్ని సమాధి చేసేందుకు సీబీఐ కంకణం కట్టుకున్నట్టు చెబుతున్నారు.

కర్ణాటకలో తవ్వితీసిన ఇనుప రజనును గోవా రేవు నుంచి అక్రమంగా ఎగుమతి చేసిన నేరంపై కేసులు నమోదు చేసేందుకు సాక్ష్యాధారాలు లభ్యం కాలేదని 2016లోనే కర్ణాటక పరిశ్రమల, వాణిజ్య (మైనింగ్ విభాగం) శాఖకు సీబీఐ లేఖ రాసిన విషయం తాజాగా బయటపడింది. మూడేళ్లపాటు దర్యాప్తు జరిపిన అనంతరం సీబీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

గోవా రేవుల నుంచి దాదాపు 12.57 కోట్ల మెట్రిక్ టన్నుల మేర ఇనుప ఖనిజం అక్రమంగా ఎగుమతి అయిందని లోకాయుక్త తన నివేదికలో పేర్కొనగా, సీబీఐ మాత్రం ఎంత మొత్తం ఎగుమతి అయిందో చెప్పలేమంటూ 13 జూన్ 2017న చేతులు ఎత్తేసి కేసుల మూసివేతకు పరోక్షంగా పచ్చజెండా ఊపింది. అలాగే, ఎగుమతిదారులు ఎక్స్‌పోర్టు డాక్యుమెంట్లను తమ వద్ద ఉంచుకోవాల్సిన అవసరం లేదని, కాబట్టి అవి ఇవ్వలేదన్న కారణంతో కంపెనీలపై చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

కర్ణాటక నుంచి గోవాకు ఏ రోజు ఖనిజాన్ని రవాణా చేశారన్న తేదీలు కూడా తమ వద్ద లేవని సీబీఐ స్పష్టం చేసింది. గోవాలోని ఇనుప ఖనిజంతో కలిపి ఎగమతి చేశారని, వీటికి ప్రత్యేకంగా లెక్కలు లేవు కాబట్టి ప్రాథమిక దర్యాప్తును నిలిపివేస్తున్నట్టు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాక, మంగళూరు, ఖర్వార్, కృష్ణపట్నం రేవుల నుంచి అక్రమంగా ఎగుమతి అయిన ఇనుప ఖనిజం కేసుల్లోనూ సాక్ష్యాలు లేకపోవడంతో మూసివేస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

గాలి జనార్దన్ రెడ్డిపై కేసులు మూసివేయనున్నట్టు తెలిసి మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. తాము సమర్పించిన సాక్ష్యాలకే విలువ లేకుండా పోయిందని అన్నారు. మరోవైపు చెక్కు ద్వారా లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన యడ్యూరప్ప మీద నమోదైన కేసులను కూడా కొట్టివేశారు. ఈ కేసులో నిందితులను విడిచిపెట్టారు.

More Telugu News