Karnataka: హంగ్ వస్తే.. ఎవరితోనూ కలవం.. మళ్లీ ఎన్నికలకే!: జేడీఎస్ నేత కుమారస్వామి

  • జేడీఎస్ కు 100 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నాం
  • అలా రాకుంటే బీజేపీ, కాంగ్రెస్ లతో కలిసే ప్రసక్తే లేదు
  • తామిచ్చిన మద్దతుతోనే బీజేపీ బలపడిందన్న కుమారస్వామి

ఈ నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాదని పలు సర్వేలు వెల్లడిస్తుండగా, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి 100 స్థానాలకు పైగా వస్తాయని అంచనా వేసిన ఆయన, ఒకవేళ హంగ్ ఏర్పడితే, తమ పార్టీ అటు బీజేపీతోగానీ, ఇటు కాంగ్రెస్ తో గానీ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హంగ్ పరిస్థితి వస్తే, మరోసారి ఎన్నికలకు వెళ్లాలన్నదే తమ అభిమతమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు తమ పార్టీ ఎన్నో హామీలను ఇచ్చిందని గుర్తు చేసిన కుమారస్వామి, బీజేపీ, కాంగ్రెస్ లతో జతకడితే, వాటిని నెరవేర్చే అవకాశం తమకు రాదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రజలు తమ వెంటే ఉన్నారని, కాంగ్రెస్ తోనే తమకు గట్టిపోటీ ఉందని, ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని దాదాపు 60 అసెంబ్లీ నియోజకవర్గాలలో తమ పార్టీకి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సవాల్ ఎదురవుతోందని తెలిపారు. తాము 150 నుంచి 160 సీట్లపై మాత్రమే ప్రధానంగా దృష్టిని సారించి, వాటిలో విజయం కోసం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అప్పట్లో బీజేపీకి తాము మద్దతిచ్చినందునే కర్ణాటకలో ఆ పార్టీ ప్రధాన పార్టీగా అవతరించిందని అన్నారు. బీఎస్పీతో పొత్తుపై స్పందిస్తూ, ఆ పార్టీకి ఉన్న దాదాపు 3 శాతం ఓటు బ్యాంకు తమకు లాభం చేకూరుస్తుందని నమ్ముతున్నామని అన్నారు.

More Telugu News