Asaram: ‘మంచి రోజులు వస్తాయి’.. వైరల్ అవుతున్న ఆశారాం బాపు ఆడియో క్లిప్

  • జైలు నుంచి తన అనుచరుడితో ఫోన్‌లో మాట్లాడిన ఆశారాం
  • రికార్డు అయిన సంభాషణ బయటకు
  • తీర్పు రోజు సంయమనం పాటించినందుకు భక్తులకు కృతజ్ఞతలు

బాలికపై అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్షకు గురైన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు మాట్లాడినట్టు చెబుతున్న ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చి వైరల్ అయింది. జైలు నుంచి ఫోనులో తన అనుచరుడితో ఆశారాం ఫోన్‌లో మాట్లాడుతూ జైలు జీవితం శాశ్వతం కాదని, మంచి రోజులు ముందున్నాయని  అన్నారు.  జైలు అధికారుల అనుమతితోనే ఆయనీ ఫోన్ సంభాషణలు జరిపినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఆశారాం తన అనుచరుడితో ఫోన్లో మాట్లాడిన మాటలను రికార్డు చేసి ఉండొచ్చని జోధ్‌పూర్ సెంట్రల్ జైలు డీజీపీ విక్రమ్ సింగ్ తెలిపారు.

సాధారణంగా ముందుగా అనుమతించిన రెండు నంబర్లకు 80 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఇస్తామని పేర్కొన్న డీజీపీ.. శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు అహ్మదాబాద్‌లోని మొతేరా ఆశ్రమానికి చెందిన భక్తుడు నిశాంత్ జాధ్వీతో మాట్లాడినట్టు చెప్పారు. ఆశారాం అతడితో మాట్లాడుతూ..‘‘ 27న సాయంత్రం 7 గంటల బులెటిన్ అన్ని ఆశ్రమాల్లోనూ వచ్చేటట్టు చూడు’’ అని ఆదేశించారు.  

అలాగే తీర్పు వెలువడిన రోజు తన  అనుచరులు జోధ్‌పూర్ రాకుండా సంయమనం పాటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతలను  పాటించాలని, తాను అదే పని చేశానని చెప్పుకొచ్చారు. ఎవరూ రెచ్చిపోవద్దని, ఆశ్రమం లెటర్ హెడ్‌ను ఉపయోగించి ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా నమ్మవద్దని కోరారు. చివర్లో, కింది కోర్టు చేసిన పొరపాటును పై కోర్టు సవరిస్తుందని, అబద్ధాలు ఎక్కువ కాలం దాగవని, మంచి రోజులు వస్తాయని ఆశారాం ఆశాభావం వ్యక్తం చేశారు. 

More Telugu News