Asaram Bapu: తీర్పు విన్న తర్వాత 'ఏదైనా చేయండి' అని వేడుకున్న ఆశారాం బాపు!

  • తన వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని శిక్ష తగ్గిస్తారని భావించిన ఆశారాం
  • తీర్పు వినగానే గుండె బద్ధలు
  • ఏదైనా చేయాలని న్యాయవాదులకు వేడుకోలు

రేప్ కేసులో ఇరుక్కున్నానని ఆయనకు తెలుసు. శిక్ష తప్పదని కూడా అతని న్యాయవాదులు ముందే చెప్పేశారు. అయినా ఏదో ఆశ. తన వయసును దృష్టిలో పెట్టుకుని విడిచిపెడతారేమోనని. అయితే, న్యాయస్థానం ముందు ఎవరైనా ఒకటేనని రుజువు చేస్తూ, జోధ్ పూర్ కోర్టు వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపుకు జీవితఖైదు విధించింది. శిక్ష విధిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఆశారాం, తీర్పు విని హతాశులయ్యారు. అంతకుముందు ఆయన్ను స్వల్ప శిక్షతో వదిలేయాలని న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని సైతం న్యాయమూర్తి తోసిపుచ్చారు.

"తీర్పు విన్న తరువాత ఆయన హృదయం బద్దలైనట్టు కనిపించింది. పైకోర్టుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. 77 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన పదే పదే తన న్యాయవాదులతో 'ఏదైనా చేయండి' అని వేడుకుంటూ కనిపించారు" అని జైలు వర్గాలు వెల్లడించాయి. కాగా 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిపిన కేసులో ఐదేళ్ల విచారణ అనంతరం కోర్టు ఆయనకు నిన్న జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

More Telugu News