Karnataka: బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కల్ల: దేవగౌడ

  • ఆ పార్టీ పాలనలో కర్ణాటక ఎంతో నష్టపోయింది
  • సిద్ధరామయ్య, యెడ్యూరప్పలకు ప్రత్యామ్నాయం కుమారస్వామే
  • ఎవరన్నది నిర్ణయించుకోవాల్సింది ప్రజలే

ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలసి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితే ఉండదని జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవగౌడ స్పష్టం చేశారు. కర్ణాటకలో హంగ్ ఏర్పడితే దేవగౌడ కింగ్ మేకర్ అవుతారని విశ్లేషకులు భావిస్తున్న విషయం తెలిసిందే.

‘‘ఏ పరిస్థితుల్లోనూ బీజేపీతో కలసి సంకీర్ణం ఏర్పాటు చేసే అవకాశం లేదు. బీజేపీ పాలనలో కర్ణాటక ఎంతో నష్టపోయింది. ఐదేళ్ల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాలించారు. బీజేపీ చేసింది అంతే. బీజేపీ హయాంలో కర్ణాటకలో జైలుకు వెళ్లిన నేతల పేర్లను చెప్పాలనుకోవడం లేదు’’ అని దేవగౌడ అన్నారు.

బీజేపీ అధికారంలోకి రావడానికి తాను సాయం చేయాలనుకోవడం లేదని, కాంగ్రెస్ కు కూడా ఇదే వర్తిస్తుందన్నారు. ఈ మేరకు తన నివాసంలో దేవగౌడ మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ సిద్ధరామయ్య, బీజేపీ యెడ్యూరప్ప కంటే తన కుమారుడు కుమారస్వామియే మంచి ప్రత్యామ్నాయం అవుతారని పేర్కొన్నారు. ఎవరు మెరుగైన పాలన అందించగలరో నిర్ణయించుకోవాల్సింది ప్రజలేనన్నారు.

More Telugu News