Hyderabad: అప్పు తీర్చమని ఒత్తిడి.. తీర్చే దారిలేక కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య!

  • మార్చిలో వివాహం చేసుకున్న జలాలుద్దీన్
  • వివాహం సందర్భంగా వంట చేసిన వ్యక్తికి 20 వేలు బాకీ
  • బాకీ చెల్లించాలంటూ ఒత్తిడి చేసిన వంట వ్యక్తి

పెళ్లిలో వంటచేసిన వ్యక్తికి ఇవ్వాల్సిన 20 వేల రూపాయలు చెల్లించలేక, పరువుపోతుందని భావించిన కొత్త పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... కంచన్‌ బాగ్‌ డివిజన్‌ గులాం ముస్తఫానగర్‌ కు చెందిన జలాలుద్దీన్‌ (25) బుక్‌ బైండర్‌ గా జీవనం సాగిస్తున్నాడు. గత మార్చిలో జలాలుద్దీన్ వివాహం జరిగింది. ఈ వివాహం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు జలాలుద్దీన్ ఇబ్బందులు పడ్డాడు. పెళ్లిలో వంట చేసిన వ్యక్తికి 20 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, నేడు, రేపు అంటూ అతనిని తిప్పుతూ వచ్చాడు.

 అయితే నిన్న సాయంత్రం ఆ వ్యక్తి ఇంటికి రావడంతో బెడ్ రూంలోకి వెళ్లిపోయి, ఇంట్లో వారితో లేడని చెప్పించాడు. దీంతో ఆ వ్యక్తి ఫోన్ చేయడంతో తాను ఇంటి వద్ద లేనని, హయత్ నగర్ లో ఉన్నానని సమాధానమిచ్చాడు. దీంతో ఆ వ్యక్తి 'ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందేనని, నువ్వొచ్చేవరకు వేచి ఉంటాన'ని సమాధానమిచ్చాడు.

దీంతో బయట పరువు పోతుందని భావించిన జలాలుద్దీన్ ఏం చెయ్యాలో పాలుపోక, బెడ్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు 108 సహకారంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

More Telugu News