Mahesh Babu: ‘బాహుబలి’ తరువాత వంద కోట్ల క్లబ్బులో ‘భరత్‌ అనే నేను’!

  • రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ‘భరత్‌ అనే నేను’
  • ఆస్ట్రేలియాలో ‘పద్మావత్‌’ తరువాత ‘భరత్‌ అనే నేను’
  • ఆస్ట్రేలియాలో రెండు రోజుల్లోనే రూ.1.44 కోట్లు

మహేశ్‌ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ సినిమాకు మంచి స్పందన వస్తోంది. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలు మొదటి రోజే అతి భారీ వసూళ్లు సాధించి ఆశ్చర్యపర్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలను పక్కన పెడితే విడుదలైన రెండు రోజుల్లోనే మహేశ్ బాబు కొత్త సినిమా ‘భరత్‌ అనే నేను’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి, అత్యంత త్వరగా ఈ రికార్డును సాధించిన సినిమాగా నిలిచిందని ఆ సినీ యూనిట్ తెలిపింది.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ దూసుకుపోతోంది. అమెరికాలో ఇప్పటివరకు 2 మిలియన్‌ డాలర్లు రాబట్టిన ఈ సినిమా మొత్తం వసూళ్ల పరంగా ‘బాహుబలి’ తర్వాతి స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేస్తూ... ఆస్ట్రేలియాలో ఈ ఏడాదిలో విడుదలైన సినిమాల్లో తొలిరోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా మహేశ్‌ సినిమా నిలిచిందని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలో ఈ జాబితాలో బాలీవుడ్‌ సినిమా ‘పద్మావత్‌’ మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాలో శుక్రవారం 38 లొకేషన్లలో 168,194 ఆస్ట్రేలియన్ డాలర్లు రాబట్టిందని, నిన్న 116,017 డాలర్లు రాబట్టిందని, రెండు రోజుల్లో కలిపి మొత్తం 284,211 డాలర్లు (రూ.1.44 కోట్లు) వసూలు చేసిందని ట్వీట్ చేశారు.  

More Telugu News