Telugudesam: నేను క్రిస్టియన్‌ను కాను.. కావాలంటే ఈ తులసి కోట, దేవుడి గది చూడండి.. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే అనిత

  • పాలక మండలి సభ్యురాలిగా అనిత నియామకంపై దుమారం
  • తాను క్రిస్టియన్‌ను అంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూనే కారణం
  • పరిశీలించాలన్న చంద్రబాబు
  • సర్టిఫికెట్లను, దేవుడి గదిని, తులసి కోటను మీడియాకు చూపించిన ఎమ్మెల్యే

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యురాలిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత నియామకంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఆమె ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూనే అందుకు కారణం. తాను క్రిస్టియానిటీ పాటిస్తానని, తన బ్యాగులో, కారులో ఎప్పటికీ బైబిల్ ఉంటుందని చెప్పిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ క్రిస్టియన్‌ను టీటీడీ పాలక మండలిలోకి ఎలా తీసుకుంటారంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. ఆమె నియామకంపై తీవ్ర దుమారం చెలరేగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అందులోని నిజానిజాలేమిటో చూడాలని పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో అనిత వివరణ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేసి తాను క్రిస్టియన్‌ను కాదని, నూటికి నూరుపాళ్లు హిందువునని పేర్కొన్నారు. తన ఇంట్లో తులసి కోట, పూజా మందిరం కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ చెప్పారు. తాను ఎస్సీ మాదిగకు చెందినట్టు తన స్టడీ సర్టిఫికెట్లలో ఉందంటూ వాటిని చూపించారు. తన ఇంట్లో ఉన్న హిందూ దేవుళ్ల ఫొటోలు, తులసి కోట, దేవుడి గదిని మీడియాకు చూపించారు. 

More Telugu News