Tamil Nadu: ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ అధికారులతో నిర్మలాదేవి ఫోన్ సంభాషణలు!

  • ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ లతో ఫోన్ సంభాషణలు
  • వీసీ కావాలన్న లక్ష్యంతో ప్రణాళిక  
  • నిర్మలాదేవి ఫోన్, వాట్స్ యాప్ రికార్డులు స్వాధీనం 

తమిళనాడు, విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగర్‌ ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థులను ఉన్నతాధికారుల లైంగిక అవసరాలు తీర్చేందుకు పంపే ప్రయత్నం చేసిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ నిర్మలాదేవి అనైతిక కార్యకలాపాల వెనుక ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్‌ అధికారుల పాత్ర ఉన్నట్లు విచారణలో తేలడం కలకలం రేపుతోంది. యూనివర్సిటీ వీసీ కావాలన్న కోరికతో నిర్మలాదేవి పక్కా ప్రణాళికతో పావులు కదిపినట్టు తెలుస్తోంది.

మధురై కామరాజ్‌ యూనివర్సిటీలో పట్టుదొరకని కాలంలో ఆమె పలువురితో సన్నిహితంగా మెలిగిందని, విద్యార్థినులకు చూడీదార్ లు, చీరలు గిఫ్టులుగా ఇచ్చి, వారితో ‘విందు’ కూడా ఏర్పాటు చేసేదని విచారణలో వెలుగు చూసింది. ఇలా సంపాదించిన అక్రమార్జనతో వీసీ పోస్టు సంపాదించాలని ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆ ఎనిమిది ప్రముఖులకు తరచూ ఫోన్లు చేయడం, గంటల తరబడి వాట్స్ యాప్‌ ద్వారా సంభాషణలు సాగించడం చేసేదని తెలుస్తోంది. ఈ రికార్డులు, పలు ఫొటోలను సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి నేతృత్వంలోని బృందం స్వాధీనం చేసుకుంది.

 దీనికి తోడు ఆమెపై లెక్కలేనన్ని ఫిర్యాదులు అందుతున్నట్టు సీబీసీఐడీ అధికారులు చెబుతున్నారు. గతనెలలోనే ఆమెపై ఫిర్యాదులందాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. యూనివర్సిటీకి చెందిన కొందరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఆమె నిర్వాకాలపై ఒక నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు పంపగా, వారు ఎలాంటి చర్య తీసుకోనట్టు తెలిసింది. దీంతో ఆ నివేదికపై వినతి పత్రాన్ని ఐఏఎస్ అధికారి ఆర్‌.సంతానంకు అందజేశారు. ఈ నివేదికలో కేవలం నిర్మలాదేవి నిర్వాకాలే కాకుండా, ఉన్నత విద్యాశాఖలో చోటుచేసుకున్న అనేక అక్రమాలపై వివరాలు ఉన్నట్టు తెలిపారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన లోతైన విచారణకు ఆమెను ఐదురోజుల కస్టడీకి అనుమతించాలని సీబీసీఐడీ అధికారులు న్యాయస్ధానాన్ని కోరగా, పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది.

More Telugu News