British: త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టిన ఘటనపై భారత్‌కు బ్రిటన్ క్షమాపణ

      * బ్రిటన్ పార్లమెంట్ స్క్వేర్ వద్ద భారత పతాకం దగ్ధం  

      * ఖలిస్థాన్ జెండా ఎగురవేత

      * పోలీసుల సమక్షంలోనే ఘటన

భారత జాతీయ పతాకాన్ని ఆందోళనకారులు తగలబెట్టిన ఘటన విషయంలో బ్రిటన్ విదేశాంగ కార్యాలయం భారత్‌కు క్షమాపణలు తెలిపింది. బుధవారం లండన్‌ పార్లమెంట్ స్వ్కేర్‌ వద్ద కొందరు నిరసనకారులు త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టారు.

వెస్ట్‌మినిస్టర్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా పాకిస్థాన్ ప్రేరేపిత ఖలిస్థాన్, కశ్మీరీ ఆందోళనకారులు పార్లమెంట్ స్క్వేర్ వద్దకు చేరుకుని అక్కడ ఎగురుతున్న భారత త్రివర్ణ పతాకాన్ని కిందికు లాగి తగలబెట్టారు. అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్, ఖలిస్థాన్‌ను ప్రతిబింబించే జెండాను ఎగురవేశారు. ఈ మొత్తం తతంగం జరుగుతున్నప్పుడు మెట్రోపాలిటన్ పోలీసులు అక్కడే ఉండడం గమనార్హం.

ఈ ఘటనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ విదేశాంగ శాఖ భారత్‌కు క్షమాపణలు తెలిపింది. జరిగిన ఘటనకు చింతిస్తున్నట్టు పేర్కొంది.
British
apologises
Indian flag

More Telugu News