Narendra Modi: ‘భారత్‌కీ బాత్’లో పాక్‌పై నిప్పులు చెరిగిన మోదీ.. సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన ప్రధాని!

  • లండన్‌లోని చారిత్రక వెస్ట్ మినిస్టర్ సెంట్రల్ హాల్‌లో మోదీ ప్రసంగం
  • హాజరైన 1700 మంది ప్రవాస భారతీయులు
  • ఉగ్రవాదుల ఎగుమతి కార్ఖానా అంటూ పాక్‌ను ఏకి పారేసిన ప్రధాని
  • ‘భారత్ మాతా కీ జై’ అంటూ సభికుల నినాదాలు

లండన్‌లోని చారిత్రక వెస్ట్‌మినిస్టర్ సెంట్రల్ హాల్‌లో ప్రవాస భారతీయులతో నిర్వహించిన ‘భారత్ కీ బాత్, సబ్‌కే సాథ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు. పాక్‌ను ఉగ్రవాదుల ఎగుమతి ఫ్యాక్టరీగా అభివర్ణించిన ఆయన 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్‌తో ఆ దేశానికి స్పష్టమైన సంకేతాలు పంపినట్టు తెలిపారు.

తాము శాంతినే కోరుకుంటున్నామని, ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను ఎగుమతి చేసే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. అలా చేసే వారికి వారి భాషలోనే సరైన సమాధానం ఇస్తామని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రధాని ఆ మాట అనగానే ప్రేక్షకులు ‘భారత్ మాతా కీ జై’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. తర్వాత మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత ఆ విషయం భారత ప్రజలకు తెలియడానికి ముందే పాక్‌కు చెప్పేందుకు చాలా ప్రయత్నించామన్నారు.

‘‘మన ప్రజలకు ఈ విషయం తెలియడానికి ముందే పాకిస్థాన్‌కు తెలియజేయాలనుకున్నాం. వారికి సమయం ఉంటే  ఉగ్రవాదుల మృతదేహాలు తీసుకెళ్లాలని కోరాం. ఉదయం 11 గంటల నుంచి ఫోన్ చేస్తుంటే 12 గంటలకు వారితో మాట్లాడగలిగాం. పదేపదే ఫోన్ చేస్తున్నా వారు ఫోన్ ఎత్తడానికి భయపడ్డారు. చివరికి వారికి చెప్పిన తర్వాతే భారత మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించాం’’ అని మోదీ వివరించారు. సర్జికల్ స్ట్రయిక్స్‌ను భారత ఆర్మీ పరిపూర్ణంగా నిర్వహించి వెనక్కి వచ్చిందని ప్రశంసించారు.

‘భారత్ కీ బాత్, సబ్‌కే సాథ్’ కార్యక్రమంలో దాదాపు 1700 మంది పాల్గొన్నారు. వీరిలో అత్యధికులు భారతీయులే. యూరోపియన్ ఇండియన్ ఫోరమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రశ్నలకు మోదీ సమాధానం ఇచ్చారు.

More Telugu News