Cash Crunch: ఖాళీ అయిన ఏటీఎంలపై కీలక ప్రకటన చేసిన రిజర్వ్ బ్యాంక్!

  • నగదు కొరత తాత్కాలికమే
  • కేవలం కొన్ని చోట్ల మాత్రమే సమస్య
  • నిర్విరామంగా నోట్ల ముద్రణ జరుగుతోంది
  • ప్రకటన విడుదల చేసిన రిజర్వ్ బ్యాంక్

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు నిల్వలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఈ సమస్య ఏర్పడిందని వ్యాఖ్యానించిన ఆర్బీఐ, కేవలం రవాణాలో ఏర్పడిన సమస్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడింది.

మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆర్బీఐ, "ఆర్బీఐ వాల్టుల్లో, కరెన్సీ చెస్ట్ లలో చాలినంత నగదు ఉంది. నాలుగు కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ లు నిర్విరామంగా పని చేస్తున్నాయి. కొన్ని చోట్ల డబ్బు బట్వాడా ఆలస్యమైన కారణంగానే నగదు కొరత ఏర్పడింది. ఇది తాత్కాలికమే. ఏటీఎంలలో నగదు నింపే పని జరుగుతోంది. పరిస్థితిని రిజర్వ్ బ్యాంకు ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. కరెన్సీ అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి తక్కువగా ఉన్న ప్రాంతాలకు పంపే ఏర్పాట్లను చేశాం" అని పేర్కొంది.

కాగా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు గత రెండు మూడు వారాలుగా నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో సైతం డబ్బు లేక, బ్యాంకుల్లో విత్ డ్రా కోసం వెళ్లిన వారికి ఒట్టి చేతులే వెక్కిరిస్తున్న పరిస్థితి. బయటకు వెళ్లిన రూ. 2 వేల నోట్లు తిరిగి బ్యాంకులకు రాకపోవడం వల్లే ఇలా జరిగిందని బ్యాంకుల ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.

More Telugu News