Tamilnadu: నేను చెప్పినట్టు చేస్తే మార్కులు, ఆర్థిక లాభం, అటెండెన్స్.. కొత్త పాఠాలు చెబుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు!

  • తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు
  • నెలన్నరలో ప్రాక్టికల్స్‌ వస్తాయి
  • రెండు రోజుల్లో ఆలోచించుకుని చెప్పండి
  • మనం మాట్లాడుకున్న విషయాలు గోప్యంగా ఉంచండి

తమిళనాడులో మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. యూనివర్సిటీ ఉన్నతాధికారులతో లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించారని ఆరోపణలు తీవ్రఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ సందర్భంగా మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్, విద్యార్థినుల మధ్య సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను ఎట్టకేలకు అరెస్టు చేశారు.

దాని వివరాల్లోకి వెళ్తే... విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోట్టైలోని దేవాంగర్‌ ఆర్ట్స్‌ కళాశాలలో మూడువేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాలలో అదే ప్రాంతానికి చెందిన నిర్మలాదేవి 15 ఏళ్లుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నారు. ఈ నెల 13న ఆమె నలుగురు విద్యార్థినులకు పోన్ చేసి ‘ఇప్పటివరకూ మన మధ్య ప్రొఫెసర్, విద్యార్థినుల సంబంధాలున్నాయి, ఇక తరువాత లెవల్‌ కు పోదాం, నలుగురూ ఒక్కచోటనే ఉన్నారు కదా, నాకు తెలుసు, నేను చెప్పినట్లు నడుచుకుంటే వర్సిటీ అధికారులతో చెప్పి మంచి మార్కులు వేయిస్తాను, ఆర్థికంగా కూడా మీకు లాభం ఉంటుంది, కళాశాలకు క్రమం తప్పకుండా రాకున్నా అటెండెన్స్‌ వచ్చేలా చేస్తాను’ అంటూ అసలు విషయం చెప్పి, బంపర్ ఆఫర్ ఇచ్చింది.

దానికి ఆ విద్యార్థినులు ‘వద్దు మేడం, మా కలాంటివి వద్దు’ అంటూ సమాధానం చెప్పారు. దీంతో ఆమె వారిని అనునయిస్తూ, ‘తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, మరో నెలన్నరలో ప్రాక్టికల్స్‌ వస్తాయి, అందుకే ఈరోజు ఫోన్‌ చేశాను, రెండు రోజుల్లో ఆలోచించుకుని చెప్పండి, మనం మాట్లాడుకున్న విషయాలు గోప్యంగా ఉంచండి’ అంటూ సూచించింది. ఇవి వాట్స్ యాప్ లో ప్రత్యక్షమై వైరల్ అయ్యాయి. దీంతో నిర్మలాదేవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విద్యార్థినులు కళాశాల కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను సస్పెండ్ చేశారు.

అనంతరం ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మధురై కామరాజర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ చెల్లదురై, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సునీల్‌ బాలివాల్ కు కళాశాల నిర్వాహకులు సూచించడంతో... పోలీసులు ఆమెను గత రాత్రి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వాట్స్ యాప్ లో వైరల్ అవుతున్న ఆడియోలో మాటలు తనవేనని ఆమె నిర్ధారించారు. అయితే తన మాటల్లో దురుద్దేశం లేదని, కొన్ని మాటలను కత్తిరించి, తప్పుడు అర్థం వచ్చేలా ఆడియో క్లిప్ తయారు చేసి వైరల్ చేశారని ఆమె ఆరోపించారు. కాగా, ఆమెను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని, విద్యార్థునులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, మహిళా సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు.

More Telugu News