CBS News: అమెరికా న్యూస్ చానల్ ఘోర తప్పిదం.. బతికి ఉండగానే మాజీ తొలి మహిళను చంపేసిన వైనం!

  • ముందే సిద్ధం చేసుకున్న వార్తను పొరపాటున పబ్లిష్ చేసిన ‘సీబీఎస్’
  • గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బార్బారా బుష్
  • జరిగిన పొరపాటును గుర్తించి తర్వాత తొలగించిన వైనం

అమెరికా న్యూస్ చానల్ సీబీఎస్ ఘోర తప్పిదం చేసింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒకప్పటి తొలి మహిళ, మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్ బుష్) సతీమణి బార్బారా బుష్ కన్నుమూసినట్టు ప్రకటించింది. వార్త విని అంతా ఒక్కసారిగా షాకయ్యారు.

బుష్ 1989 నుంచి 1993 వరకు అమెరికా 37వ అధ్యక్షుడిగా పనిచేశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బార్బారా బుష్‌కు వైద్యులు తదుపరి సేవలు నిలిపివేసినట్టు తెలుసుకున్న న్యూస్ చానల్ ఆమె తుదిశ్వాస విడిచినట్టు పేర్కొంది. అయితే పొరపాటుగా ఈ న్యూస్ పబ్లిష్ అయినట్టు తెలుస్తోంది.

92 ఏళ్ల బార్బారా బుష్‌ తన స్వగృహంలో ప్రశాంతంగా చనిపోయినట్టు బుష్ అధికార ప్రతినిధి తెలిపినట్టు న్యూస్ చానల్ పేర్కొంది. తర్వాత జరిగిన పొరపాటును గుర్తించిన చానల్ వార్తను ఉపసంహరించుకుంది. వార్తలు ముందే సిద్ధం చేసుకోవడం న్యూస్ చానళ్లకు మామూలే. అయితే అది పొరపాటున పబ్లిష్ కావడంతో కలకలం రేగింది. కాగా, ఈ తప్పిదంపై న్యూస్ చానల్ ఇప్పటి వరకు స్పందించలేదు.

More Telugu News