India: ఐఆర్సీటీసీ బంపరాఫర్... ఆధార్ అనుసంధానం చేస్తే రెట్టింపు టికెట్లు

  • మరింత మెరుగైన సేవలందించాలని నిర్ణయం
  • ఆధార్ అనుసంధానం చేసుకుంటే 12 టికెట్లు
  • మధ్యాహ్నం 12 వరకూ క్విక్ బుక్ సర్వీస్ నిలిపివేత
  • కొత్త విధివిధానాలు ప్రకటించిన ఐఆర్సీటీసీ

రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా ఐఆర్సీటీసీ తన నిబంధనల్లో మార్పులను ప్రకటిస్తూ, ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి బంపరాఫర్ ఇచ్చింది. ఇప్పటివరకూ ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్న యూజర్లు గరిష్ఠంగా ఆరు టికెట్లను మాత్రమే పొందవచ్చు. అదే ఆధార్ తో అనుసంధానం చేసుకుంటే, నెలకు 12 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఉదయం 8 గంటలకు ఆన్ లైన్ రిజర్వేషన్ ప్రారంభం కాగానే, 10 గంటలలోపు ఒక యూజర్ 2 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలుగుతాడని కూడా నిబంధనలు మార్చింది.

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సింగిల్ పేజ్ లేదా క్విక్ బుక్ సర్వీస్ ను నిలిపివేస్తున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది. కొత్తగా వెబ్ సైట్ లో నమోదు చేసుకునే వారు ఇకపై ఓ భద్రతాపరమైన ప్రశ్నను ఎంచుకుని, దానికి సమాధానాన్ని చెప్పాల్సి వుంటుంది. ఇక అధీకృత ఏజంట్లు ఉదయం 8 నుంచి 8.30, 10 నుంచి 10.30, 11 నుంచి 11.30 గంటల మధ్య మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలుగుతారు.

ఇక రిజర్వేషన్ ప్రారంభమైన సమయం నుంచి తొలి అరగంట పాటు ట్రావెల్ ఏజంట్లు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే వీలుండదు. నెట్ బ్యాంకింగ్ లో ఓటీపీ తప్పనిసరి చేసిన నేపథ్యంలో రుసుముల చెల్లింపునకు మరో 10 సెకన్ల సమయాన్ని కేటాయించాలని కూడా ఐఆర్సీటీసీ నిర్ణయించింది.

More Telugu News