Hyderabad: తెలంగాణ ప్రభుత్వ దవాఖానాల్లో కొత్త మార్చురీ విధానాన్ని అమలు చేస్తాం : మంత్రి లక్ష్మారెడ్డి

  • హైద‌రాబాద్ లోని ఉస్మానియా వైద్య‌శాల‌ను సందర్శించిన మంత్రి
  • మార్చురీ, కోల్డ్ స్టోరేజీ, ఫోరెన్సిక్ విభాగాల‌ పరిశీలన
  • మార్చురీల‌లో ఇంకా మెరుగైన వ‌స‌తులు కల్పిస్తాం
  • అవ‌స‌ర‌మైతే విదేశాల్లో మార్చురీ విధానాన్ని పరిశీలిస్తాం

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లో ఉన్న మార్చురీల‌ను ఆధునికీకరించేందుకు చ‌ర్య‌లు చేపడతామని, కొత్త మార్చురీ విధానాన్ని త్వరలోనే అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ సి. ల‌క్ష్మారెడ్డి చెప్పారు. హైద‌రాబాద్ ఉస్మానియా వైద్య‌శాల‌లో శ‌వాల‌ను భ‌ద్ర‌ప‌రిచే గ‌దులు (మార్చురీ), కోల్డ్ స్టోరేజీ, ఫోరెన్సిక్ విభాగాల‌ను ఆయన పరిశీలించారు.

అనంతరం, మీడియాతో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, 24 గంట‌ల పాటు మార్చురీల్లో మృత దేహాల‌కు శ‌వ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అంశం పరిశీలనలో ఉందని అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని 113 హాస్పిట‌ల్స్‌లో మార్చురీ సేవ‌లందిస్తున్నామని, ఇప్ప‌టికే రాష్ట్రంలో 232 మృత దేహాల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు ఫ్రీజ‌ర్ల ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పార్థివ దేహాల‌కు కూడా గౌర‌వ ప్ర‌ద‌మైన రీతిలో అవ‌స‌ర‌మైన సేవ‌లు -నిల్వ చేయ‌డం - పోస్టుమార్టం నిర్వ‌హించ‌డం - ర‌వాణా చేయ‌డం - త‌గు విధంగా ఖ‌న‌నం చేసేందుకు తగు ఏర్పాట్లన్నీ ప్ర‌భుత్వం చేస్తోందని అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 50 మార్చురీ (పార్థివ‌) వాహ‌నాలు అందుబాటులో ఉన్నాయని, మ‌రో 50 కొత్త వాహ‌నాల‌ను, ప‌ర‌మ‌ప‌ద సేవా కేంద్రాల‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లో ఉన్న మార్చురీల‌లో ఇంకా మెరుగైన వ‌స‌తుల ఏర్పాటు కోసం త‌గిన ప్ర‌ణాళిక‌లు రూపొందించామని, మార్చురీలో అవ‌స‌ర‌మైన విధంగా ప‌రిక‌రాలు, ఫ్రీజ‌ర్లు, కొత్త గ‌దుల‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేశామని అన్నారు.

అవ‌స‌ర‌మైతే విదేశీ ప‌రిజ్ఞానాన్ని, అక్క‌డ ఉన్న మార్చురీ విధానాన్ని ప‌రిశీలించి నూత‌న పాల‌సీని రూపొందిస్తామని, ఉస్మానియా హాస్పిట‌ల్‌లో మార్చురీని సెంట్ర‌లైజ్డ్ ఏసీతో నిర్వ‌హించాల‌ని, పురాత‌న భ‌వ‌నాలు, శిథిలావ‌స్థ‌లో ఉన్న భ‌వ‌నాల‌ను తొల‌గించి, కొత్త భ‌వ‌నాల‌ను నిర్మించాల‌ని టిఎస్ఎంఎస్ ఐడీసీకి ఆదేశాలు జారీ చేశారు. కొత్త‌గా ఫోరెన్సిక్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ప్రస్తావించారు. 

More Telugu News