మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తోంది: హెచ్చరించిన రష్యా మీడియా

15-04-2018 Sun 09:57
  • సిరియాపై ప్రయోగించేందుకు అణ్వస్త్రాలు సిద్ధం చేసుకున్న అమెరికా
  • బషర్ అసద్ కు వ్యతిరేకంగా అమెరికా అడుగులు వేస్తోంది
  • ఇప్పటికే విమాన దాడులకు పాల్పడుతున్న యూఎస్, యూకే, ఫ్రాన్స్
  • రష్యా మీడియా కథనాలు
ఏడు సంవత్సరాలుగా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారనుందని రష్యా మీడియా హెచ్చరించింది. సిరియాపై అమెరికా అణు దాడి జరిపేందుకు సిద్ధంగా ఉందని, అణ్వస్త్రాలను అమెరికా సిద్ధం చేసిందని అభిప్రాయపడింది. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, వార్ జోన్ లో ప్రస్తుతం రసాయన దాడులు చేస్తున్నారని, ఇవే కొనసాగితే, అమెరికా చూస్తూ ఊరుకోబోదని తెలిపింది.

సిరియాలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ జరుపుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ, రష్యా చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ తిరస్కరించిన నేపథ్యంలో మీడియా సంస్థలు వరల్డ్ వార్ హెచ్చరికలు జారీ చేశాయి. రష్యా ముసాయిదాను చైనా, బొలీవియా సహా ఎనిమిది దేశాలు వ్యతిరేకించాయని గుర్తు చేసిన పత్రికలు, అమెరికాను అడ్డుకునేందుకు ప్రపంచం కదలి రావాలని కోరాయి. ఇప్పటికే సిరియాలోని రసాయన ఫ్యాక్టరీలపై యూఎస్, యూకే, ఫ్రాన్స్ లు విమాన దాడులకు పాల్పడుతున్నాయని, బషర్ అసద్ కు వ్యతిరేకంగా అమెరికా అడుగులు వేస్తోందని ఆరోపించాయి.