KCR: బెంగళూరు చేరిన కేసీఆర్ టీమ్... వెంట ప్రకాష్ రాజ్ కూడా!

  • తృతీయ కూటమి ఏర్పాటుపై కేసీఆర్ బిజీ
  • బెంగళూరులో దేవెగౌడతో నేడు చర్చలు
  • ఇప్పటికే మద్దతు పలికిన మమతా బెనర్జీ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిపి తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఈ ఉదయం జనతాదళ్ (యూ) నేతలతో కీలక చర్చలు జరిపే నిమిత్తం కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు. సీఎంతో పాటు ఎంపీలు సంతోష్ కుమార్, వినోద్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, శేఖర్ రెడ్డిలతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉండటం గమనార్హం. బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన కేసీఆర్ బృందం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లారు.

బెంగళూరులో ఈ మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై తృతీయ కూటమిపై చర్చించనున్నారు. పద్మనాభ నగర్ లోని దేవెగౌడ నివాసానికి వెళ్లే కేసీఆర్, అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. దేశ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దేవెగౌడ సలహాలను, సూచనలను తీసుకోనున్నారు. చర్చల అనంతరం సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి అరవింద్ కేజ్రీవాల్ నూ కేసీఆర్ కలవనున్నారు. ఇప్పటికే కూటమి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కూటమికి ఆమె మద్దతు తెలిపారు. ఆపై జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ తో మాట్లాడి వెళ్లారు.

More Telugu News