Garuda vega: టీవీల్లో సహా ఎక్కడా రాజశేఖర్ 'గరుడ వేగ' ప్రదర్శించకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు... కారణమిదే!

  • సూపర్ హిట్ అయిన 'గరుడ వేగ'
  • యురేనియం కుంభకోణంపై చర్చిస్తూ సాగే కథ
  • కోర్టును ఆశ్రయించిన యురేనియం కార్పొరేషన్
  • వారి వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి

రాజశేఖర్‌ హీరోగా నిర్మితమై సూపర్ హిట్ అయిన తాజా చిత్రం 'గరుడ వేగ'ను ఎక్కడా ప్రదర్శించరాదని హైదరాబాద్ సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీవీలు సహా, యూ టూబ్‌ తదితర ఏ మాధ్యమం ద్వారానూ చిత్ర ప్రదర్శన ఉండరాదని, సినిమా ప్రచార కార్యక్రమాలు, ప్రెస్‌ మీట్‌ లు నిర్వహించరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చిత్రం తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని హైదరాబాద్‌ ఉప్పరపల్లిలోని అటామిక్‌ ఎనర్జీ డిపార్ట్‌ మెంట్‌ కు చెందిన పీఎస్యూ యురేనియం కార్పొరేషన్‌ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.

సినిమా యురేనియం కార్పొరేషన్‌ లో జరిగిన కుంభకోణం గురించి చర్చించిందని, తమ సంస్థకు యురేనియం ప్లాంట్‌ ఏపీలోని తుమ్మలపల్లిలో ఉందని గుర్తు చేసిన యురేనియం కార్పొరేషన్, స్కామ్ లో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ, వివిధ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఉన్నట్టుగా సినిమాలో చూపించారని ఆరోపించింది. సినిమా చూసిన న్యాయమూర్తి, వారి వాదనలతో ఏకీభవిస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్టు చెప్పారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.

More Telugu News