tajmahal: తాజ్ మహల్ సున్నీ వక్ఫ్ బోర్డుకి చెందుతుందంటే ఎవరు నమ్ముతారు?: సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

  • చారిత్రక కట్టడాల పరిరక్షణ బాధ్యతలు స్వీకరించిన ఏఎస్ఐ
  • తాజ్ మహల్ తమది అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు
  • విలువైన కోర్టు సమయం వృథా అవుతోందన్న సీజే 
తాజ్ మహల్ తమకు చెందుతుందంటూ ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. స్వాతంత్ర్యానంతరం దేశంలోని సాంస్కృతిక కట్టడాలను కాపాడే బాధ్యత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కు ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ బాధ్యతలు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా తీసుకుంది. అయితే, దీనిపై ఉత్తరప్రదేశ్ సున్నీ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తాజ్‌ మహల్‌ తమకు చెందుతుందని, షాజహాన్ దానిని తమకు రాసిచ్చాడని సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కలుగజేసుకుని...తాజ్‌ మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? అని సున్నీ బోర్డును ప్రశ్నించారు. ఇలాంటి కేసుల వల్ల విలువైన కోర్టు సమయం వృథా అవుతోందని మండిపడ్డారు. సున్నీ వక్ఫ్ బోర్డుకు తాజ్ మహల్ చెందుతుందంటూ షాజహాన్ రాసిచ్చిన పత్రాలను వారం రోజుల్లో చూపాలని ఆదేశించారు. కేవలం షాజహాన్‌ చేసిన డిక్లరేషనే కాకుండా మరేవైనా ఇతర ఆధారాలు ఉంటే వాటిని కూడా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని సూచించారు.  
tajmahal
Supreme Court
Uttar Pradesh

More Telugu News