KL Rahul: ఐపీఎల్‌లో రెండో రోజే రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్!

  • సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన రాహుల్
  • ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ
  • యూసుఫ్ పఠాన్ రికార్డు బద్దలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో రోజే రికార్డు నమోదైంది. మొహాలీలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ ఓపెనర్ కేఎల్ రాహుల్ మెరుపు వేగంతో అర్ధ సెంచరీ సాధించి ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. 14 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 364 స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేశాడు. గతంలో యూసుఫ్ పఠాన్ 15 బంతుల్లో అర్ధ సెంచరీ నెలకొల్పిన రికార్డును తాజాగా రాహుల్ బద్దలుగొట్టాడు. అంతేకాదు, టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగానూ తన పేరును లిఖించుకున్నాడు.

గతంలో యువరాజ్ సింగ్, గేల్ 12 బంతుల్లో, ట్రెస్కోథిక్ 13 బంతుల్లో అర్ధ సెంచరీలు చేశారు. ఇప్పుడు రాహుల్ 14 బంతుల్లో ఆ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 6 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. లోకేశ్ రాహుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద అవార్డు’ లభించింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ జట్టు రాహుల్‌ని రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. ఆడిన తొలి మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించి తన రేటుకి న్యాయం చేశాడు.   

More Telugu News