Supreme Court: నేడు రాజ్యసభలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం.. దేశ చరిత్రలోనే తొలిసారి!

  • సీజే జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసనకు రంగం సిద్ధం
  • 50 మంది సభ్యుల మద్దతు అవసరం
  • కొందరు కాంగ్రెస్ నేతలు విముఖత

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసనకు రంగం సిద్ధమైంది. నేడు రాజ్యసభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి. ఈ విషయంపై గురువారమే న్యాయనిపుణలతో ప్రతిపక్ష నేతలు చర్చించారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ నేతలు విడివిడిగా సమావేశమై చర్చించారు. గతంలో ఈ తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేసిన వారిలో కొందరి పదవీకాలం ఈనెల 2న ముగియడంతో తాజాగా మరికొందరి సంతకాలు తీసుకున్నారు.

జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 50 మంది మద్దతు అవసరం కావడంతో అందుకోసం కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. విపక్ష నేతలను వరుసగా సంప్రదిస్తూ వారి మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అయితే, దీపక్ మిశ్రాపై అభిశంసనకు కొందరు కాంగ్రెస్ నేతలు సుముఖంగా లేనట్టు సమాచారం.  ఈ కారణంగా జాప్యం జరుగుతున్నట్టు చెబుతున్నారు.

మరోవైపు బడ్జెట్ సమావేశాలు ముగిసేందుకు ఒక్క రోజే గడువు ఉండడంతో తీర్మానంపై సందేహం నెలకొంది. ప్రతిపక్షాలు ఇచ్చే నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి పంపిన తర్వాత, ఆయన దానిని పరిశీలిస్తారు. అవసరం లేదనుకుంటే ఆయన దానిని తిరస్కరించే అవకాశం ఉంది. లేదంటే ఓ కమిటీ వేసి పరిశీలనకు పంపే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం దేశంలోనే ఇదే తొలిసారి కానుంది.

More Telugu News