Blackbuck: దోషిగా తేలితే ఆరేళ్ల వరకూ శిక్ష... నేడు తేలనున్న సల్మాన్ ఖాన్ భవితవ్యం!

  • కృష్ణ జింకలను వేటాడాడని సల్మాన్ పై ఆరోపణ
  • సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలీ బింద్రేలపైనా కేసులు
  • నేడు తీర్పును వెలువరించనున్న న్యాయస్థానం

సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను తన చేతిలోని తుపాకితో కాల్చాడా? ఈ ప్రశ్నకు జోధ్ పూర్ కోర్టు నేడు సమాధానం ఇవ్వనుంది. కృష్ణ జింకలను వేటాడటం సహా, అక్రమంగా ఆయుధాలను కలిగివున్న కేసులో నేడు తీర్పు వెలువడనుండగా, సల్మాన్ దోషిగా తేలితే ఆరేళ్ల వరకూ జైలుశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

20 సంవత్సరాల క్రితం, 1988లో జోధ్ పూర్ పరిసర ప్రాంతాల్లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలీ బింద్రేలతో కలసి పాల్గొన్న వేళ, వేటకు వెళ్లి కృష్ణ జింకలను సల్మాన్ వేటాడాడన్నది ప్రధాన అభియోగం. వీరందరితో పాటు నీలమ్ కూడా ఈ కేసులో నిందితురాలిగా ఉండగా, కంకణీ గ్రామ సమీపంలో సల్మాన్ స్వయంగా కృష్ణ జింకను కాల్చాడని పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.

సల్మాన్ పై వన్యప్రాణి రక్షణ చట్టం కింద కేసు నమోదు కాగా, ఇతరులపై తక్కువ తీవ్రత గల సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గత నెల 28వ తేదీతో కోర్టులో వాదనలు ముగియగా, కేసును సుదీర్ఘంగా విచారించిన చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖాత్రి తన తీర్పును నేడు వెలువరించనున్నారు.

More Telugu News