cbse: సీబీఎస్ఈ రీఎగ్జామ్ ను బాయ్ కాట్ చేయండి: రాజ్ థాకరే పిలుపు

  • ప్రశ్నాపత్రాల లీకేజీకి కేంద్రమే బాధ్యత వహించాలి
  • తప్పు మీరు చేసి... విద్యార్థులకు శిక్ష విధిస్తారా?
  • ఎట్టి పరిస్థితుల్లోనూ రీఎగ్జామ్ కు ఒప్పుకోవద్దు

ప్రశ్నాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో సీబీఎస్ఈ నిర్వహించనున్న రీఎగ్జామ్ ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బహిష్కరించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే పిలుపునిచ్చారు. క్వశ్చన్ పేపర్ లీక్ కావడానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ తప్పును ఒప్పుకోకుండా... రీఎగ్జామ్ పేరుతో విద్యార్థులను మరిన్ని కష్టాలకు గురి చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

 ప్రశ్నాపత్రాలను కాపాడలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తాము చేసిన తప్పుకు విద్యార్థులు ఎందుకు శిక్షను అనుభవించాలని ప్రశ్నించారు. రీఎగ్జామ్ రాయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరాదని... ఇప్పుడు తల వంచితే... భవిష్యత్తులో మరెన్నో సార్లు ఇలాగే తల వంచాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అందరూ కలసికట్టుగా, ఈ సమస్యను ఎదుర్కోవాలని చెప్పారు. తాము చేసిన తప్పులకు విద్యార్థులను శిక్షించేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం... ముందు పార్లమెంటు ఉభయసభలను సజావుగా నడిపించాలని చురక అంటించారు.

More Telugu News