Time: 'టైమ్స్' అత్యంత ప్రభావశీలుర జాబితా!

  • మోదీ, ట్రంప్, పుతిన్ లకు స్థానం
  • సత్య నాదెళ్ల, టిమ్ కుక్, జుకర్ బర్గ్ లు కూడా
  • త్వరలో అధికారికంగా విడుదల కానున్న జాబితా

ఈ సంవత్సరపు అత్యంత ప్రభావ శీలుర జాబితాను ప్రఖ్యాత 'టైమ్' మేగజైన్ విడుదల చేయగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల, చైనా అధ్యక్షుడు జన్ పింగ్ తదితరులకు స్థానం లభించినట్టు తెలుస్తోంది.

మొత్తం 100 మందిని ఈ సంవత్సరం జాబితాలో టైమ్ చేర్చిందని సమాచారం. గడచిన పదేళ్లుగా, విశేష సేవలందించిన నాయకులు, కళాకారులు, సైంటిస్టులు, కార్యకర్తలు, ఔత్సాహికులను ఈ జాబితాలో చేరుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో అధికారికంగా ఈ జాబితా విడుదల కానుంది.

కాగా, ఈ జాబితాలో మోదీ గత సంవత్సరం కూడా స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం జాబితాలో చోటు దక్కించుకున్న ఇతరుల్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, పాక్ లోని అమెరికన్ నటుడు కుమెయిల్ నంజియానీ, ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుషనర్, ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్, బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలోని ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేథరిన్, ప్రిన్స్ హ్యారీ, ఆయనకు కాబోయే భార్య మేఘన్ మార్కెల్, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తదితరుల పేర్లు ఉన్నాయని సమాచారం.

వీరితో పాటు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్, పోప్ ఫ్రాన్సిస్, జెఫ్ సెషన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్, ఉబెర్ సీఈఓ డారా ఖోస్రోవ్ షాహి, 'మీటూ' ఉద్యమ వ్యవస్థాపకురాలు తరానే బుర్కే, నటుడు డ్వేనీ జాన్సన్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ ఈలాన్ ముస్క్, యాపిల్ చీఫ్ టిమ్ కుక్, ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామే తదితరుల పేర్లూ ఉన్నట్టు తెలిసింది.

More Telugu News