BJP: బీజేపీకి షాకిచ్చేందుకే శత్రుఘ్నసిన్హా నిర్ణయం!

  • తగిన గౌరవం దక్కడం లేదని అసంతృప్తి
  • మమతా బెనర్జీని కలిసిన శత్రుఘ్నసిన్హా
  • పాట్నా నుంచి బరిలోకి దిగాలని నిర్ణయం

బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా పార్టీని వీడనున్నారా? ఇప్పటికే పార్టీలో తనకు తగినంత గౌరవం దక్కడం లేదని వ్యాఖ్యానించిన ఆయన, తదుపరి ఎన్నికల్లో మరో పార్టీ అభ్యర్థిగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు పర్యటనలు చేస్తున్న మమతా బెనర్జీని ఆయన స్వయంగా కలవడంతో బీజేపీకి దూరం అయ్యేందుకు ఆయన మానసికంగా సిద్ధపడ్డట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

శత్రుఘ్నసిన్హా వెంట అరుణ్ శౌరీ కూడా ఉండటం గమనార్హం. కాగా, తాను ఏ పార్టీలో చేరాలన్నా పాట్నా టికెట్ ఇవ్వడం తప్పనిసరని, తనకు చాలా పార్టీలు ఇక్కడి నుంచి పోటీకి అవకాశం ఇస్తాయని హామీ ఇచ్చాయని సిన్హా వ్యాఖ్యానించారు. గతంలో పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తూ, దాదాపు 200 సీట్లలో విజయం సాధించుకు వచ్చిన అద్వానీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసునని కూడా ఆయన అన్నారు. సిన్హా మాటలు, జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే, నేడో, రేపో ఆయన బీజేపీకి టాటా చెప్పవచ్చన్న అంచనాకు వచ్చేస్తున్నారు విశ్లేషకులు.

More Telugu News