Australia: ఆసీస్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ.. టాప్ స్పాన్సర్ మాగెల్లాన్ రాం రాం!

  • క్రికెట్ ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ
  • ఒక్కొక్కరుగా బయటకొస్తున్న స్పాన్సర్లు
  • డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన ఏఎస్ఐసీఎస్
  • క్వాంటాస్ ఎయిర్‌లైన్స్, కామన్వెల్త్ బ్యాంకు కూడా అసంతృప్తి

బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ఆసీస్ జట్టుకు ఈసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు అతిపెద్ద స్పాన్సర్ అయిన ఫండ్ మేనేజర్ మాగెల్లాన్ సీఏతో తన కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది. అదే  సమయంలో డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు స్పోర్ట్స్ వస్తువుల కంపెనీ ఏఎస్ఐసీఎస్ ప్రకటించింది.

క్రికెట్ ఆస్ట్రేలియాతో మాగెల్లాన్ ఆగస్టు 2017లో మూడేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. డీల్ విలువ మొత్తం 28 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు. అన్యాయమైన రీతిలో గెలుపు కోసం ప్రయత్నించిన ఆసీస్ జట్టు తీవ్ర తప్పిదానికి పాల్పడిందని, నిబంధనలను ఉల్లంఘించిందని మాగెల్లాన్ చీఫ్ హమీష్ డగ్లస్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మాగెల్లాన్ యాషెస్ సిరీస్‌తో చాలా సంతోషంగా ఉన్నామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం తప్ప మరోమార్గం లేదని ఆయన పేర్కొన్నారు. ఇతర స్పాన్సర్లు అయిన క్వాంటాస్ ఎయిర్‌లైన్స్, కామన్వెల్త్ బ్యాంకులు కూడా బాల్ ట్యాంపరింగ్‌కు వ్యతిరేకంగా గళమెత్తాయి.

More Telugu News