Harish Rao: అర్ధరాత్రి సమయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ .. మల్లన్నసాగర్ సొరంగం పనుల పరిశీలన

  • మల్లన్నసాగర్, పంప్ హౌస్ పనులను పరిశీలించిన హరీశ్ రావు
  • రెట్టింపు స్థాయిలో లేబర్ ను పెంచాలి
  • యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశం

కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ ఇరుసు లాంటిదని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన  ప్యాకేజ్ 12 పనులను సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. కీలకమైన మల్లన్న సాగర్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రెట్టింపు స్థాయిలో లేబర్ ని పెంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

ప్యాకేజ్ 12 కింద మల్లన్న సాగర్ రిజర్వాయర్, కాలువల పనులు జరుగుతున్నాయి. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ నుండి తొగుట మండలం తుక్కపూర్ వరకు సొరంగం, పంప్ హౌస్ పనులను పరిశీలించారు. మల్లన్నసాగర్ కాళేశ్వరంలో వ్యూహాత్మక ప్రదేశమని, ఇది ఎత్తైన ప్రాంతంలో ఉందని, ఈ సొరంగం దాదాపు 17 కిలోమీటర్లు ఉండగా పనులు పూర్తి స్థాయిలో జరిగాయని తెలిపారు. ఇందులో 8 కిలోమీటర్లకు పైగా సిమెంట్ లైనింగ్ పనులు పూర్తి అయ్యాయని, మల్లన్నసాగర్ ద్వారా 5 జిల్లాలకు గోదావరి జలాలు అందనున్నట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ వైపు, యాదాద్రి జిల్లాలో గందమల్ల, బస్వాపూర్, నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో షామీర్ పేటలో దీని ఫలాలు అందనున్నాయని, వారం పది రోజుల్లో పంప్ హౌస్ పనులు, సర్జ్ పూల్  గేట్లు పూర్తి కానున్నట్టు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు 50 టీఎంసీలతో నిర్మిస్తున్నామని, ఒకవైపు ఈ ప్రాజెక్టు పనులు అవుతున్నప్పటికీ మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు ఈ సొరంగం, పంప్ హౌస్ ద్వారా కాలువలకు మిగతా రిజర్వాయర్ లకు, చెరువులు కుంటలకు నీరందించే విధంగా పనులు జరుగుతున్నట్టు చెప్పారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో విదేశాల నుంచి మోటార్ లను తెప్పించి పనులు చేపడుతున్నామని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పని చేస్తున్న కార్మికులకు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా హరీశ్ రావు ఆదేశించారు.  కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టులలో జరుగుతున్నాయని, అన్నారం బ్యారేజీకి 66, మేడిగడ్డకు 86, సుందిళ్ళ బ్యారేజీకి 74 గేట్లను అమర్చాల్సి ఉంది. ఈరోజు వరకు సుందిళ్ళ బ్యారేజీలో 20 గేట్లను బిగించారు. మిగతా రెండు బ్యారేజీలలోనూ గేట్ల బిగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. కాళేశ్వరంకు సంబంధించిన బ్యారేజీలు, పంప్ హౌజ్ పనుల్లో 80 శాతం సిమెంటు కాంక్రీటు పనులు పూర్తయినట్టు హరీశ్ రావు ఇటీవలే ప్రకటించారు. అన్నారం-కన్నేపల్లి  మధ్య గ్రావిటీ కెనాల్ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. కన్నేపల్లి, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం పంప్ హౌజ్ లకు అవసరమైన యంత్రాల దిగుమతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి ఈ యంత్ర సామాగ్రి  రవాణా అవుతోంది. కన్నేపల్లి దగ్గర్ గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ , హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఫోర్ బే వరకు చేరిన నీటిని శక్తిమంతమైన విద్యుత్ మోటార్ల ద్వారా ఎత్తి అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించనున్నారు. ఇందుకోసం కన్నేపల్లి పంపు హౌజ్ లో 17 మోటార్లు అమర్చనున్నారు. నీటిని పంపింగ్ చేయడానికి గాను 5 మీటర్లు, 3.5 మీటర్ల వ్యాసార్థంతో ఉన్న భారీ పైపులను నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. కన్నేపల్లి పంపు హౌజ్ నుంచి దాదాపు కిలోమీటరున్నర దూరం వరకు పైపుల ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి నీటిని నింపనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ పనులు మరింత ఊపందుకున్నాయి. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ప్రాజెక్టు అవసరాలకు ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

More Telugu News