NGO: యాసిడ్‌ దాడి చేసిన మాజీ ప్రియుడ్ని కటకటాల్లోకి నెట్టించిన యువతి..!

  • 2014లో తల్లితో కలిసి షాపుకు వెళుతుండగా యాసిడ్ దాడికి గురైన యువతి
  • ఎన్జీఓ సాయంతో కలకత్తా హైకోర్టులో కేసు నమోదు
  • ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు...అతని చెంపచెళ్లుమనిపించిన బాధితురాలు

నాలుగేళ్ల కిందట తన ముఖాన్ని యాసిడ్‌తో అంద వికారంగా చేసిన తన మాజీ ప్రియుడ్ని ఓ యువతి ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టించింది. వివరాల్లోకెళితే, పశ్చిమ్ బెంగాల్‌లోని డండం ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సంచాయితా యాదవ్ సెప్టెంబరు, 2014లో ఓ రోజు సాయంత్రం సేథ్‌బాగన్‌లోని ఓ షాపుకు తన తల్లితో కలిసి వెళుతుండగా బైకుపై వచ్చిన సాహా ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు.

దాంతో ఆమె ఒక్కసారిగా యాసిడ్ మంటకు విలవిలలాడిపోయింది. అక్కడే ఉన్న వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సంచాయితాకు చికిత్స చేయించడానికి ఆమె తల్లి చివరకు అప్పులు కూడా చేసింది. తన కుమార్తె కుడి కన్నుని కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం చివరకు ఫలించలేదు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, విచారణ మాత్రం నత్తనడకన సాగుతూ వచ్చింది.

దాంతో యాసిడ్ బాధితులకు ఆపన్నహస్తాన్ని అందించే ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ) ఆమెకు బాసటగా నిలిచింది. ఆ సంస్థ సాయంతో ఆమె మానవహక్కుల సంస్థను ఆశ్రయించింది. వారి సాయంతో ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ కలకత్తా హైకోర్టులో కేసు దాఖలు చేసింది. కేసు విచారణ 2017లో మొదలయింది. ఎట్టకేలకు నిందితుడు సాహాని సోనార్‌పూర్‌లో ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్లు డండం పోలీసులు తెలిపారు.

తనకు ఇంత ద్రోహం చేసిన అతన్ని నాలుగేళ్ల తర్వాత చూడగానే ఆమెకు కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అతని చెంపచెళ్లుమనిపించింది. ఇన్నేళ్లుగా తాను నరకం అనుభవిస్తుంటే అతను మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఆమె ఆవేశంతో ఊగిపోయింది. మరోవైపు తనలాగా న్యాయానికి నోచుకోని ఎందరో యాసిడ్ బాధితుల కోసం పోరాటం చేసేందుకు సంచాయితా 2016లో మానవ హక్కుల సంస్థలో చేరింది. నిందితుడిని కోర్టు దోషిగా ప్రకటించి అతన్ని కఠినంగా శిక్షిస్తే తనతో పాటు తన లాంటి ఎందరో బాధితుల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

More Telugu News