Malaysia: తప్పుడు వార్తలకు పదేళ్ల కారాగారం...! కొత్త చట్టానికి మలేసియా సర్కార్ కసరత్తు

  • తప్పుడు వార్తలకు పదేళ్ల జైలు లేదా భారీ జరిమానా విధింపుకు మలేసియా సర్కార్ ప్రతిపాదన
  • కొత్త చట్టం తీసుకురావడానికి కసరత్తు
  • ఆగస్టులో జరిగే సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసమే ప్రధాని రజాక్ ప్రభుత్వం ఇలా చేస్తోందని విపక్షాల విమర్శలు

తప్పుడు వార్తలు రాసిన వారికి, అలాంటి వార్తలను ప్రచారం చేసిన వారికి పదేళ్ల జైలుశిక్ష విధించేలా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు మలేసియా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదేళ్ల కారాగారం లేదా 5 లక్షల రింగిట్‌ల (128000 డాలర్లు లేదా దాదాపు 84 లక్షల రూపాయలు) జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో ఈ రెండింటినీ విధించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఆగస్టులో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసమే మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని హక్కుల కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ప్రతిపాదనను ప్రతిపక్ష ఎంపీ శాంటిగో తీవ్రంగా విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో నజీబ్ రజాక్ హయాంలో జరిగిన అవినీతిపై ఎవరూ విమర్శలు చేయకుండా చేయడానికే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ప్రజా భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు ఏ మాత్రం భంగం కలిగించదని భరోసా కల్పిస్తుండటం గమనార్హం. మరోవైపు కొత్తగా తీసుకురాబోయే చట్టంలోని నిబంధనలను విదేశాలకు వెళ్లినప్పుడు ఉల్లంఘించినా సరే వారు మలేసియాలో శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.

More Telugu News