Aadhaar: ఆధార్‌ను అయితే ప్రశ్నిస్తారు కానీ.. వీసా కోసం తెల్లోళ్ల ముందు మాత్రం బట్టలిప్పేస్తారు: కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఆధార్‌లో ఇచ్చేవి పేరు, చిరునామానే కదా
  • అడిగితే విప్లవం వచ్చేస్తుంది
  • వీసా కోసం తెల్లవాడి ముందు నగ్నంగా నిలడతారు
  • కేజే అల్ఫోన్స్ తీవ్ర వ్యాఖ్యలు

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి కేజే అల్ఫోన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆధార్ డేటాబేస్‌కు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నవారిపై విరుచుకుపడ్డారు. ఆధార్‌ను ప్రశ్నించే వారు వీసా కోసం తెల్లవారి ముందు నగ్నంగా నిలబడడానికి కూడా సిద్ధమైపోతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీసా కోసం గుడ్డలు ఇప్పేందుకు కూడా సిద్ధమైపోతారని ఆక్షేపించారు. ఆధార్ గురించి సమాచారం ఇమ్మంటే చాలు పెను విప్లవం వచ్చేస్తుందని ఎద్దేవా చేశారు.

‘‘అమెరికా వీసా కోసం నేను పది పేజీల దరఖాస్తు నింపాను. మన చేతి వేలి ముద్రలు ఇవ్వడానికి, తెల్లవాడి ముందు నగ్నంగా నిలబడడానికి సిద్ధమైపోతాం. కానీ మన సొంత ప్రభుత్వం పేరు, అడ్రస్ అడిగితే మాత్రం వ్యక్తిగత గోప్యతలో ప్రభుత్వం చొరబడుతోందని ఆరోపిస్తూ పెను విప్లవం వచ్చేస్తుంది’’ అని విరుచుకుపడ్డారు.

ప్రభుత్వం వద్దనున్న ఆధార్ సమాచారం పూర్తి భద్రంగా ఉందన్న ఆయన ఆధార్‌లో ఇస్తున్నవి కేవలం పేరు, చిరునామా మాత్రమే అన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘ఉడాయ్’ వద్దనున్న సమాచారాన్ని తస్కరించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. దీనికి పూర్తిస్థాయిలో రక్షణ ఉందన్నారు.

More Telugu News