Chandrababu: చంద్రబాబు సామాన్యుడు కాదు, అనుకున్నది సాధిస్తాడు!: డిప్యూటీ సీఎం కేఈ

  • ఏపీకి న్యాయం కోసం వేచిచూస్తున్నాం
  • మా సహనాన్ని పరీక్షించొద్దు
  • కేంద్రం అవమానపరుస్తోంది టీడీపీని కాదు, తెలుగు ప్రజలను

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సామాన్యుడు కాదని, అనుకున్నది సాధించి తీరుతారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము వేచి చూస్తున్నామని, తమ సహనాన్ని పరీక్షించొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అవమానపరుస్తున్నది తెలుగుదేశం పార్టీని కాదని, తెలుగు ప్రజలనని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని పునరాలోచించుకోవాలని, రాష్ట్రానికి ఏం ఇవ్వాలనుకున్నా ప్రధాని మోదీ ముందుగానే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదానా? లేక ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలా? అనే విషయాన్ని స్పష్టం చేసి నిధులు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.

 ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్న ఎంపీలను పిలిచి మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలను పిలిచి మోదీ మాట్లాడితే ప్రయోజనమేమిటని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన గంట సమయంలోనే 46 పార్టీలు మద్దతు తెలిపిన విషయాన్ని కేఈ ప్రస్తావించారు. ఈ సందర్భంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశంపై ఆయన మాట్లాడారు. ఒకప్పటి రాజధాని అయిన కర్నూలులో కనీసం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ బెంచ్ ఏర్పాటుకు రాయలసీమలో కర్నూలు సరైన ప్రాంతమని అన్నారు. థర్డ్ ఫ్రంట్ విషయమై కేసీఆర్ ఆహ్వానం పంపితే టీడీపీ ఆలోచిస్తుందని అన్నారు.

More Telugu News