BSP: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన బీఎస్పీ ఎమ్మెల్యే.. సస్పెండ్ చేసిన మాయావతి

  • బీఎస్పీ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్
  • పదో స్థానానికి పోటీ చేసి పరాజయం పాలైన బీఎస్పీ
  • ఎస్పీతో పొత్తు కొనసాగుతుందన్న మాయావతి

రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటేసిన బీఎస్పీ ఎమ్మెల్యే అనిల్ సింగ్‌పై ఆ పార్టీ చీఫ్ మాయావతి స్పస్పెన్షన్ వేటు వేశారు. పదో సీటును బీజేపీకి కోల్పోవడంపై మాయావతి మాట్లాడుతూ బీఎస్పీ అభ్యర్థికి అఖిలేష్ యాదవ్ తొలి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఎస్పీ చీఫ్ రాజకీయ అపరిపక్వత కారణంగానే ఇలా జరిగిందన్నారు.

‘‘నేను కనుక అఖిలేశ్ యాదవ్ స్థానంలో ఉండి ఉంటే మా అభ్యర్థి కంటే ముందు అతడి అభ్యర్థికే తొలి ప్రాధాన్యం ఇచ్చి ఉండేదానిని’’ అని మాయావతి పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయినంత మాత్రాన ఎస్పీ-బీఎస్పీ బంధానికి వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పారు. తమ అభ్యర్థి ఓటమికి అఖిలేశ్‌ను నిందించబోవడం లేదన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 10 రాజ్యసభ స్థానాల్లో బీజేపీ బలాన్ని బట్టి ఆ పార్టీ 8 స్థానాలు, ఎస్పీ ఒకటి (జయా బచ్చన్) గెలుచుకోవడం ఖాయమని తేలిపోగా పదో స్థానంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఎస్పీ-బీఎస్పీ ఓ అంగీకారానికి రావడంతో పదో స్థానానికి బీఎస్పీ రంగంలోకి దిగింది. భీంరావ్ అంబేద్కర్‌ను బరిలో నిలిపింది. దీంతో ఆ స్థానాన్ని కూడా దక్కించుకునేందుకు బీజేపీ పావులు కదిపి తొమ్మిదో స్థానానికి కూడా అభ్యర్థిని నిలబెట్టింది. బీఎస్పీ ఎమ్మెల్యే అనిల్ సింగ్ క్రాస్ ఓటింగ్ కి పాల్పడి బీజేపీకి ఓటేయడంతో భీంరావ్ పరాజయం పాలయ్యారు.

More Telugu News