Commonwealth Games: కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధుకు అరుదైన గౌరవం

  • భారత జట్టుకు బ్యాడ్మింటన్ స్టార్ సింధు నాయకత్వం
  • త్రివర్ణ పతాకధారిగా ఎంపిక
  • ఏప్రిల్ 4 నుంచి క్రీడలు షురూ

వచ్చే నెల 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కింది. క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. టోర్నీలో భాగంగా ఏప్రిల్ 4న గోల్డ్ కోస్ట్‌లోని కరార స్టేడియంలో ఆరంభ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సింధు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని భారత జట్టుకు నాయకత్వం వహించనుంది.

భారత జట్టులో స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్, మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో సింధు బ్రహ్మాండమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆమెను పతాకధారిగా ఎంపిక చేసినట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారి ఒకరు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనే భారత క్రీడాకారిణులు గతంలో మాదిరిగా చీరలు కాకుండా ఈ సారి కోటు, ట్రౌజర్ ధరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 70 దేశాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఈ క్రీడల్లో భారత్ పాల్గొనడం 15వ సారి.

More Telugu News