hero motor corp: ఏపీకి మరో మణిహారం... 600 ఎకరాల్లో హీరో మోటార్స్ కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు!

  • చిత్తూరు జిల్లాలో హీరో మోటార్స్ కు శంకుస్థాపన
  • 600 ఎకరాల్లో రూ. 1600 కోట్లతో ఆటోమొబైల్ సంస్థ
  • పవన్ ముంజాల్ కు అభినందనలు తెలిపిన చంద్రబాబు

నవ్యాంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వచ్చింది. ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రస్థానంలో కొనసాగుతున్న హీరో మోటార్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదనపాలెం వద్ద ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. రూ. 1600 కోట్లతో, 600 ఎకరాల్లో ఈ సంస్థను నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటికే ఏపీకి కియా మోటార్స్, అపోలో టైర్స్, హీరో మోటార్స్, వీర వర్ణ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ లు వచ్చాయని... అశోక్ లేల్యాండ్, భారత్ ఫోర్జ్ వస్తున్నాయని చెప్పారు. టీవీఎస్ బ్రేక్స్ కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించబోతోందని తెలిపారు. మరిన్ని కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వీటన్నింటి సహకారంతో రాయలసీమను ఆటోమొబైల్స్ హబ్ గా మార్చబోతున్నామని చెప్పారు. దాదాపు రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న సంస్థలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నీటి కొరత లేదని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదని తెలిపారు. ఇప్పటి వరకు 13 లక్షల 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. వీలైనంత త్వరలో కంపెనీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని హీరో మోటార్స్ సంస్థను కోరుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా హీరో మోటార్ కార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ కు చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

More Telugu News