Tamilnadu: బీమా కంపెనీ మాయాజాలం.. రైతుకు నష్టపరిహారం 2 రూపాయలు!

  • తమిళనాడు రైతులకు పంట నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేసిన దిండిగల్ కేంద్ర సహకార బ్యాంక్
  • 10, 5, 4, 2 రూపాయల చెక్కులను రైతులకు అందజేసిన బ్యాంక్
  • బ్యాంక్ ఖాతా కోసం రైతు 500 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిపై విమర్శలు

బీమా కంపెనీ రైతులకు అందజేసిన నష్టపరిహారంపై తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. దాని వివరాల్లోకి వెళ్తే.. వాతావరణం అనుకూలించక పంట నష్టపోయిన దిండిగల్, నాగపట్నం జిల్లాల్లోని రైతులకు దిండిగల్ కేంద్ర సహకార బ్యాంక్ నష్టపరిహారాన్ని చెక్కు రూపంలో అందజేసింది. కరుపసామి అనే రైతు 102 రూపాయల పంట బీమా చేయించగా, అతను నష్టపోయిన పంటకు 10 రూపాయల చెక్కు అందజేసింది.

తిరుమలైసామి అనే మరో రైతు 50 రూపాయల ప్రీమియం కట్టగా, అతనికి 5 రూపాయల నష్టపరిహారం చెక్కు ఇచ్చింది. మరో రైతుకు 4 రూపాయల చెక్కు, ఇంకో రైతుకు 2 రూపాయల చెక్కులు అందజేసింది. ఈ చెక్కులను అసెంబ్లీలో ప్రదర్శించిన మాజీ మంత్రి, డీఎంకే నేత కె.పిచండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రూపాయలకు ఏమొస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి తోడు ఈ చెక్కులను మార్చుకోవాలంటే 500 రూపాయలతో బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉందని, 2 రూపాయల కోసం 500 ఖర్చుతో బ్యాంకు ఖాతా తెరవడమంత దారుణం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. 

More Telugu News