shivaji: పెన్‌డ్రైవ్‌లోని వీడియోలో సంచలన అంశాలు.. జాతీయ పార్టీ ఆపరేషన్ గురించి స్పష్టంగా వివరించిన శివాజీ

  • రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి జాతీయ పార్టీకి మూడు టార్గెట్లు ఉంటాయి
  • 1.అధికార పార్టీ  2. ఓ కొత్త రాజకీయ నాయకుడు 3.ఇంకో ముఖ్యపార్టీ
  • అధికార పార్టీపై సీబీఐ కేసులు
  • చివరకు 'ఇంకో ముఖ్యపార్టీ' నాయకుడు జైలుకు
  • ఏపీ సీఎంగా జాతీయ పార్టీకి చెందిన ఓ తెలుగు వ్యక్తి

ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఓ జాతీయ పార్టీ పెద్ద ఆప‌రేష‌న్ చేస్తోంద‌ని సినీన‌టుడు, ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఓ వీడియో రూపొందించి పెన్‌డ్రైవ్ లో ఉంచాన‌ని, దాన్ని విడుద‌ల చేస్తాన‌ని చెప్పిన ప్ర‌కారం ఆయ‌న దాన్ని మీడియాకు అందించారు. తాను ఆ పార్టీ పేరు, దానికి స‌హ‌క‌రిస్తోన్న వారి పేర్ల‌ను ప్ర‌త్య‌క్షంగా చెప్ప‌డం లేదని, దీనిని వినేవారే అర్థం చేసుకోవాల‌ని శివాజీ వ్యాఖ్యానించారు.

తాను గ‌త ఏడాది ఢిల్లీలో కొన్ని నిజాల‌ను తెలుసుకున్నాన‌ని అన్నారు. ఓ జాతీయ పార్టీకి ఓ అనుబంధ సంస్థ నేతలు స్వీప‌ర్ సెల్స్ లా ప‌నిచేస్తున్నారని అన్నారు. కర్ణాటకకు చెందిన 'కల్యాణ్ జీ' అనే వ్య‌క్తి ఒకరు ఉన్నారని, ఆయన అసలు పేరు అదో కాదో తనకు తెలియదని, తనకు తెలిసినంత వరకు ఆయన పేరు కల్యాణ్ జీ అని అన్నారు. ‌దక్షిణాదిన ఆ జాతీయ పార్టీకి కల్యాణ్ జీ అనే ఆ వ్యక్తే స‌హ‌క‌రిస్తున్నార‌ని తెలిపారు.
 
శివాజీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

"ఓ జాతీయ పార్టీ ఉంది. ఆప‌రేష‌న్ ద్ర‌విడను తెలుగు రాష్ట్రాల్లో నిర్వ‌హిస్తోంది. ఈ ఆప‌రేష‌న్‌ను ఎవరు డీల్ చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం.. ఏపీకి సంబంధించి మూడు టార్గెట్‌లు పెట్టుకుంది. 1.అధికార పార్టీ  2. ఓ కొత్త రాజకీయ నాయకుడు 3. ఇంకో ముఖ్యపార్టీ.

1. అధికార పార్టీ: సీబీఐ కేసులని రీ ఓపెన్ చేయడం, ఆర్థికంగా దెబ్బ తీయడం, చక్ర బంధం చేయడం, ఆ పార్టీని చివరకు ఒంటరిని చేయడం, తద్వారా నిర్వీర్యం చేయడం ఈ వ్యూహ లక్ష్యాలు.

2. కొత్త నాయకుడు: తాను పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు పాపం ఈ నాయకుడికి తెలియదు. స్థానిక ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం ఈయన లక్ష్యం. ఇందులో భాగంగా ఈయన ప్రజలకు కొన్ని మాటలు చెబుతారు. రాష్ట్రం పట్ల తనకు చాలా బాధ్యత ఉన్నట్లు, సమాజం పట్ల ప్రేమ ఒలకబోస్తాడు. రాజకీయాల్లోంచి వైదొలగిన కొందరు నాయకులని ఈ కొత్త నాయకుడు కలుస్తాడు. వాళ్లు ఈ కొత్త నాయకుడికి సహకరిస్తుంటారు. ప్రభుత్వాన్ని ఎలా డిస్టర్బ్ చేయాలనే విషయాన్ని వారు ఈ కొత్త నాయకుడికి చెబుతుంటారు. మ‌న తెలుగువారికి స‌హ‌జంగా ఉండే స్వార్థాన్ని ఆ జాతీయ పార్టీ ఉప‌యోగించుకుంటోంది.

3.ఇంకో ముఖ్యపార్టీ: నేరం నిరూపితం కాలేదు కాబట్టి ఈ పార్టీ ముఖ్య నాయకుడు ఇంకా నిందితుడు మాత్రమే. అసలు బలి పశువులు వీరే. ఈ విషయం వీరికి తెలియదు. జాతీయ పార్టీలో తేలికగా చేరొచ్చని వీళ్లు అనుకుంటున్నారు. జాతీయ పార్టీయే కావాల‌నే ఈ ముఖ్య పార్టీ కోసం దారులు తెరిచింది. ఈ ముఖ్య పార్టీ నాయ‌కుడి మీద గుంటూరు, హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే రెక్కీ నిర్వ‌హించారు. ప‌క‌డ్బందీగా ప్రాణ‌హాని లేని దాడి చేస్తారు. దీంతో ఈ రాష్ట్రంలో అల‌జ‌డులు మొద‌ల‌వుతాయి. అదే సమయంలో కొన్ని విష‌యాల్లో (కేసుల్లో) ఈ ముఖ్య నాయ‌కుడికి ఊర‌ట‌లు ల‌భిస్తాయి. పూర్తి ఊర‌ట మాత్రం రాదు. పెండింగ్ లో ఉంటుంది. అదే సమయంలో బీహార్, ఒడిశా నుంచి వ‌చ్చి కొంద‌రు రాష్ట్రంలో అల్ల‌ర్లు మొద‌లు పెడ‌తారు.

సెప్టెంబ‌రు 1న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. అదే చివరి తేదీ.. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి, ఆ నాయకుడు మొదటి సారిగా ఇదే రోజున ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం ఎన్నికల్లో కొత్త నాయకుడికి, ఏపీలోని ముఖ్య పార్టీకి సీట్లు పడతాయి. ఎన్నికల తరువాత ముఖ్య పార్టీకి చెందిన వ్యక్తిని కూడా కేసుల్లో చివరకు జైలుకి వెళ్లేలా చేస్తారు. ఇక ఈ కొత్త నాయకుడిని కేంద్ర మంత్రిగా ఉండాలని చెబుతారు. కేంద్ర మంత్రిగా ఉండడం ఇష్టం లేక ఆ కొత్త నాయకుడు అలిగి వెళ్లిపోతాడు.

చివరకు ఇప్పటి అధికార పార్టీలోని నేతలు మరో పార్టీలోకి వెళతారు. జాతీయ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి ఎవరవుతారంటే.. ఆ పార్టీకి చెందిన ఓ తెలుగు వ్యక్తి అవుతారు.. ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేస్తారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఓ వ్యక్తి కోవర్టుగా కూడా పనిచేస్తున్నారు. అధికారం, డబ్బు ఆశ అన్నీ కల్పిస్తారు. చివరకు నష్టపోయేది మన రాష్ట్రమే. నాకు ఏ పార్టీపైన కోపం లేదు. ఆ జాతీయ పార్టీ వేసిన ప్లాన్‌లో చిక్కుకుపోవద్దు. నాకు తెలిసిన విషయాలను చెప్పాను. మీ రాజకీయ భవిష్యత్తు కోసం, స్వార్థం కోసం తెలుగు తల్లిని అవమానంలోకి నెట్టకండి".

More Telugu News