Chandrababu: నేను ఎవరితోనూ లాలూచీ పడలేదు: శాసనమండలిలో చంద్రబాబు

  • పోలవరం ప్రాజెక్టు విషయంలో కుట్రలు జరుగుతున్నాయి 
  • డబ్బులు రానివ్వకుండా చేయాలనుకుంటున్నారు
  • దేశంలో డీపీఆర్‌-1 పూర్తిగా ఖర్చుపెట్టిన ప్రాజెక్టు పోలవరం ఒక్కటే
  • పోలవరం ప్రాజెక్టు కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం

తాను ఎవరితోనూ ఏ విషయంలోనూ లాలూచీ పడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు విషయంలో కుట్రలు జరుగుతున్నాయని, కొందరు డబ్బులు రానివ్వకుండా చేయాలనుకుంటున్నారని అన్నారు. దేశంలో డీపీఆర్‌-1 పూర్తిగా ఖర్చుపెట్టిన ప్రాజెక్టు పోలవరం మాత్రమేనని, ఆ ప్రాజెక్టు కోసం తాము రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు దేశ సంపద అని, ఇందులో కుట్రలు వద్దని చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇస్తోన్న రైతులను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నారని అన్నారు. అన్ని ఆటంకాలను తొలగించుకుని ముందుకు వెళుతున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందనే పట్టిసీమ చేపట్టామని, దాన్ని కూడా అడ్డుకోవాలని కొందరు చూశారని అన్నారు. పట్టి సీమ వల్ల గోదావరిని డెల్టా ఎడారిగా మారుతుందని రెచ్చగొట్టారని అన్నారు.

సవాలుగా తీసుకుని ఒకే సంవత్సర కాలంలో పట్టిసీమను పూర్తి చేశామని, ఆ ప్రాజెక్టు ద్వారా రూ.2500 కోట్ల విలువైన పంటలను కాపాడామని చంద్రబాబు చెప్పారు. తన సొంత నియోజక వర్గం కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లిచ్చానని అన్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో బురద చల్లే ప్రయత్నాలు ఎంతవరకు సబబని చంద్రబాబు ప్రశ్నించారు.

More Telugu News