hyderabad best city: నివాసానికి హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమం... తాజా సర్వేలో వెల్లడి

  • ఆహ్లాదకర వాతావరణం, తక్కువ నేరాలు
  • తర్వాత పుణెకు ఆ ఘనత
  • చక్కని నివాస వసతులు
  • అంతర్జాతీయంగా ఈ రెండింటికీ 142వ స్థానం
  • చివరి స్థానంలో ఢిల్లీ

హైదరాబాద్ మరోసారి మెరుగైన నగరమనే కీర్తిని సొంతం చేసుకుంది. తక్కువ నేరాలు, ఆహ్లాదకర వాతావరణం వెరసి సిటీ ఆఫ్ పెర్ల్స్ గా గుర్తింపు పొందింది. దేశంలోనే అత్యుత్తమ నివాస నగరంగా మెర్సెర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే 2018లో మరోసారి చోటు దక్కించుకుంది. హైదరాబాద్ నంబర్ 1 నగరంగా నిలవడం వరుసగా ఇది నాలుగో ఏడాది.

హైదరాబాద్ అంతర్జాతీయంగా మెరుగైన నగరాల్లో పుణెతో సమానంగా నిలిచింది. ఈ రెండూ అంతర్జాతీయంగా 142వ స్థానంలో ఉన్నాయి. దేశంలో మిగిలిన నగరాలు బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్ కతా, న్యూఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ ఎంతో ముందుంది. దేశీయంగా చూస్తే న్యూఢిల్లీ నివాసానికి అనుకూలత విషయంలో ఎప్పటి మాదిరిగానే చివరి స్థానం దక్కించుకుంది. ట్రాఫిక్, వాయు కాలుష్యమే ఢిల్లీ దుర్గతికి కారణం. నాణ్యమైన జీవనం విషయంలో బెంగళూరు, ముంబై, కోల్ కతా, చెన్నై తక్కువ ర్యాంకుల్లోనే ఉండడం గమనార్హం. టెక్నాలజీ కేంద్రాలైన హైదరాబాద్, పుణె నగరాలు మాత్రం నివాసయోగ్యత విషయంలో మెరుగ్గా ఉన్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది.

హైదరాబాద్ లో నేరాలు తక్కువ, చక్కని వాతావరణం సానుకూలతలు కాగా, పుణెలో నివాస వసతులు, వినియోగ వస్తువుల లభ్యత సానుకుల అంశాలు.  ప్రపంచవ్యాప్తంగా చూస్తే 450 పట్టణాలతో కూడిన జాబితాలో  వియన్నా నివాస స్వర్గధామంగా మొదటి స్థానం సొంతం చేసుకుంది. జ్యురిచ్, ఆక్లాండ్, మ్యునిచ్, వాంకోవర్ తర్వాత ఉన్నాయి. పట్టణ పారిశుద్ధ్యం విషయంలో బెంగళూరు 194, చెన్నై 199, కోల్ కతా 227, న్యూఢిల్లీ 228 స్థానాల్లో నిలిచాయి.

More Telugu News