Lok Sabha: అవిశ్వాసానికి, స్పీకర్ కూ మధ్య అడ్డుగా టీఆర్ఎస్, అన్నాడీఎంకే!

  • నేడు కూడా రభస జరిగే అవకాశం
  • రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ఆందోళన
  • కావేరీ బోర్డు కోసం అన్నాడీఎంకే
  • సభను వాయిదా వేస్తూ వెళుతున్న స్పీకర్

ఎన్డీయేపై అవిశ్వాస తీర్మానంపై చర్చ నేడైనా జరుగుతుందా? టీడీపీ, వైసీపీ ఇచ్చిన తీర్మానాలపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? నేడు కూడా రభస జరిగి వాయిదా పడుతుందా? ఇదే ఇప్పటి మిలియన్ డాలర్ ప్రశ్న. తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలన్న కోరికతో, తొలి పది రోజుల పాటు వెల్ లో నిలబడి నినాదాలతో హోరెత్తించిన తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీ ఎంపీలు, గత రెండు సెషన్లలో మాత్రం బుద్ధిమంతులుగా మారి తమతమ స్థానాల్లో కూర్చున్నారు.

ఇదే సమయంలో రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి, కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లో నిరసనలు తెలుపుతున్నారు. సభ ఆర్డర్ లో లేదని చెబుతూ అవిశ్వాసంపై చర్చ కొనసాగించే పరిస్థితి లేదని అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేస్తున్నారు.

తమ అవిశ్వాస తీర్మానానికి సహకరించాలని టీడీపీ, వైసీపీ సభ్యులు టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా వారు వినిపించుకునే స్థితిలో లేరు. ఇక బీజేపీ సూచనలతోనే ఈ రెండు పార్టీలూ వెల్ లో నిరసనకు దిగి సభ వాయిదా పడేలా చూస్తున్నాయన్నది కొన్ని విపక్ష పార్టీల ఆరోపణ. తాము ఏపీకి హోదాకు వ్యతిరేకం కాదని, ఇదే సమయంలో తమ డిమాండ్ల సాధనకు ఇంతకన్నా మరో మార్గం లేదని టీఆర్ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించారు.

అన్నాడీఎంకే సభ్యులు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన పరిస్థితి. అవిశ్వాసంపై చర్చకు తాము సిద్ధమేనని రాజ్ నాథ్ సింగ్, అనంత్ కుమార్ వంటి కేంద్ర మంత్రులు సభలో వెల్లడించినప్పటికీ, నినాదాల మధ్య చర్చ కొనసాగేందుకు అంగీకరించేది లేదని స్పీకర్ చెప్పకనే చెప్పేశారు. ఆర్థిక బిల్లును మాత్రం నిరసనల మధ్యే ఆమోదింపజేసుకున్న సభ, అవిశ్వాసం విషయంలో భయపడిపోతోందని వైసీపీ విమర్శించింది. ఈ నేపథ్యంలో నేడు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

More Telugu News