Ola: హైదరాబాదీలకు కొత్త కష్టం... క్యాబ్ లు దొరకక అవస్థలు!

  • దేశవ్యాప్తంగా ఓలా, ఉబెర్ డ్రైవర్ల సమ్మె
  • డిమాండ్లను పరిష్కరించాలని నిరసన
  • క్యాబ్ లు దొరకక ప్రజల ఇబ్బందులు

తమ డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ ఓలా, ఉబెర్ వంటి యాప్ ఆధారిత టాక్సీ డ్రైవర్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సమ్మెకు దిగడంతో నిత్యమూ క్యాబ్ లను అశ్రయించి తమ గమ్యస్థానాలకు చేరే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో క్యాబ్ లకు తీవ్ర కొరత ఏర్పడగా, చిన్న చిన్న క్యాబ్ సంస్థలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ సహా న్యూఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు తదితర నగరాల్లో క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. తమ చెల్లింపు విధానాన్ని పునర్వ్యవస్థీకరించాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

తాము రూ. 7 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి క్యాబ్ లను ఓలా, ఉబెర్ వంటి సంస్థల్లో రిజిస్టర్ చేసుకుంటే, నెలకు లక్షన్నర రూపాయల వరకూ ఆదాయం వస్తుందని మోసపు మాటలు చెప్పారని, ప్రస్తుతం దానిలో సగం కూడా తమకు రావడం లేదని డ్రైవర్ల సంఘం నేత సంజయ్ నాయక్ ఆరోపించారు. కంపెనీ అధీనంలోని కార్లకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, డ్రైవర్ యజమానిగా ఉన్న కార్లకు బుకింగ్స్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. లోన్ గ్యారెంటీ లెటర్లు ఇవ్వడం లేదని, ముద్రా స్కీమ్ ఉన్నప్పటికీ దాన్ని తాము వినియోగించుకోలేకున్నామని తెలిపిన ఆయన, తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓలా, ఉబెర్ యాజమాన్యాలు దిగిరాకుంటే, సమ్మెను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

More Telugu News